చాంపియన్‌ భారత్‌

Indian womens hockey team beats Japan 3-1 in final - Sakshi

మహిళల హాకీ సిరీస్‌ ఫైనల్స్‌

హిరోషిమా: మహిళల హాకీ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీ చాంపియన్‌గా భారత్‌ అవతరించింది. ఇప్పటికే ఫైనల్స్‌ చేరడం ద్వారా ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన భారత్‌ హిరోషిమాలో ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 3–1 గోల్స్‌ తేడాతో ఆతిథ్య జపాన్‌పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన తుది పోరులో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న భారత్‌ జపాన్‌ను మట్టికరిపించింది. భారత్‌ తరపున మరోసారి రాణించిన గుర్జిత్‌ కౌర్‌ రెండు గోల్స్‌(45వ, 60వ నిమిషంలో) సాధించి విజయంలో కీలకపాత్ర పోషించింది. రాణి రాంపాల్‌(3వ నిమిషంలో) మరో గోల్‌  నమోదు చేసింది. జపాన్‌ తరపున నమోదైన ఏకైక గోల్‌ను మోరి కనోన్‌(11వ నిమిషంలో) సాధించింది.

మ్యాచ్‌ మొత్తంలో భారత్‌ 26 సార్లు జపాన్‌ రక్షణ వలయంలోకి ప్రవేశించగా, జపాన్‌ కేవలం 13 సార్లు మాత్రమే భారత్‌ రక్షణ వలయంలోకి ప్రవేశించింది. మ్యాచ్‌లో భారత్‌కు 8 పెనాల్టీ కార్నర్స్‌ లభించగా జపాన్‌కు కేవలం 2 మాత్రమే లభించాయి. భారత్‌ సాధించిన మూడు గోల్స్‌ కూడా పెనాల్టీ కార్నర్‌ల రూపంలో రావడం విశేషం. టోర్నీలో అపజయం ఎరుగని భారత్‌ మొత్తం 27 గోల్స్‌ చేయగా కేవలం 4 గోల్స్‌ను మాత్రమే ప్రత్యర్థులకు సమర్పించుకుంది. భారత కెప్టెన్‌ రాణి రాంపాల్‌ బెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలవగా, గుర్జీత్‌ కౌర్‌ టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో చిలీ 3–1తో పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3–3 గోల్స్‌తో సమంగా ఉండటంతో షూటౌట్‌లో విజేతను నిర్ణయించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top