భారత్-పాక్ మ్యాచ్ మా దగ్గర వద్దు | India vs Pakistan: Trouble for BCCI as Himachal government opposes World T20 tie | Sakshi
Sakshi News home page

భారత్-పాక్ మ్యాచ్ మా దగ్గర వద్దు

Mar 2 2016 12:07 AM | Updated on Sep 3 2017 6:46 PM

భారత్-పాక్ మ్యాచ్ మా దగ్గర వద్దు

భారత్-పాక్ మ్యాచ్ మా దగ్గర వద్దు

టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఈనెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొంది.

న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఈనెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొంది. ఈ మ్యాచ్‌కు తాము ఆతిథ్యమివ్వలేమని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మ్యాచ్‌కు సరైన భద్రతను కల్పించలేమని ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్... కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. స్థానికుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌ను తాము నిర్వహించలేమన్నారు. ‘ధర్మశాలలో మ్యాచ్ వద్దు. ఇటీవల పఠాన్‌కోట్‌లాంటి ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పాక్‌తో మ్యాచ్ ఏర్పాటు చేస్తే స్థానికుల మనోభావాలు దెబ్బతింటాయి.

ఇక్కడి సైనికులు చాలా మంది జమ్మూ కాశ్మీర్‌లో ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మా యుద్ధ అనుభవజ్ఞులు ధర్మశాలలో ఇండో-పాక్ మ్యాచ్ వద్దనుకుంటున్నారు. వాళ్ల అభిప్రాయాలను హిమాచల్ క్రికెట్ సంఘం పరిగణనలోకి తీసుకోవాలి. మా వాళ్లు క్రికెట్‌కు వ్యతిరేకం కాదు.. కేవలం పాక్‌తో మ్యాచ్ మాత్రమే వద్దంటున్నారు’ అని సింగ్ పేర్కొన్నారు. ఓవరాల్‌గా రెండు సూపర్-10 మ్యాచ్‌లతో కలిపి ధర్మశాల 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది.
 
రాజకీయాలొద్దు: ఠాకూర్
మరోవైపు వీరభద్ర సింగ్ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఆందోళన వ్యక్తం చేశారు. మ్యాచ్‌ల విషయంలో రాష్ట్రం రాజకీయాలు చేయకూడదన్నారు. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడానికి ఇది సరైన సమయం కాదని సూచించారు. ‘వరల్డ్‌కప్ వేదికలను ఏడాది కిందట నిర్ణయించాం. ఆరు నెలల కిందటే ఆయా వేదికలకు మ్యాచ్‌లను కేటాయించాం. మేం ఆతిథ్యమివ్వలేమని అప్పుడు చెప్పినా బాగుండేది. షెడ్యూల్‌ను చూసి చాలా మంది ఇప్పటికే మ్యాచ్ టిక్కెట్లు, ఇతర సౌకర్యాలు బుక్ చేసుకున్నారు.

వాళ్లకు సరైన వసతులు కల్పిస్తామని కూడా చెప్పాం. కానీ చివరి నిమిషంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా చెప్పడం సరికాదు’ అని ఠాకూర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలో పని చేస్తున్న హిమాచల్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దక్షిణాసియా క్రీడల సందర్భంగా వందల మంది పాక్ అథ్లెట్లకు అస్సాం భద్రత కల్పించినప్పుడు... ఇప్పుడు హిమాచల్‌కు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. భద్రత కల్పించలేమని చెప్పడం ఇటీవల పాక్ చేస్తున్న ఆరోపణలకు ఊతమివ్వడమేనన్నారు. ఇలా చేయడం వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని ధ్వజమెత్తారు.
 
‘కార్గిల్’ తర్వాత ఫొటోలు దిగలేదా?
ధర్మశాలలో పాక్ జట్టు ఆడేందుకు వ్యతిరేకిస్తున్న చాలా మంది స్థానిక నాయకులు (హిమాచల్ ప్రదేశ్)... 2005లో అదే జట్టు ఇక్కడ ఆడినప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ఠాకూర్ ప్రశ్నించారు. కార్గిల్ యుద్ధం తర్వాత ఇదే నాయకులు పాక్ ఆటగాళ్లకు బొకేలు ఇచ్చి.. వాళ్లతో ఫొటోలకు పోజు ఇవ్వలేదా? అని విమర్శించారు. ధర్మశాలలో మ్యాచ్ జరగాలని చాలా మంది కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని తెలిపారు. కాబట్టి క్రీడల్లో రాజకీయాలను చూడొద్దని, దేశ ప్రతిష్టగా భావించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement