
నాలుగో రోజు ఆట ఆసాంతం ఊరించిన విజయం చివరకు ..
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ విజయానికి రెండు వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ఆసాంతం ఊరించిన విజయం చివరకు రేపటికి వాయిదా పడి నిరాశను మిగిల్చింది. భారత విజయాన్ని ఆసీస్ టెయిలెండర్స్ ప్యాట్ కమిన్స్ (61), నాథన్ లయన్(6)లు అడ్డుకున్నారు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. వీరి వికెట్ల కోసం ఎన్ని వ్యూహాలు.. బౌలర్లను మార్చినా అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో కమిన్స్ 86 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో కెరీర్‌లో రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక మ్యాచ్ ఫలితం కోసం అంపైర్లు ఆటను అరగంట పొడిగించినా ఈ టెయిలండర్ జోడీ ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికే 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత్ విజయం కోసం రేపటి వరకు నిరీక్షించక తప్పలేదు.
రెండో ఇన్నింగ్స్‌లో 54/5 ఓవర్ నైట్ స్కోర్‌తో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లిసేన మరో 52 పరుగులు జోడించి 106/8 స్కోర్ వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ (42), రిషభ్ పంత్(33)లు ఆరో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. దీంతో ఆసీస్‌కు 399 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు ఆదిలోనే ఓపెనర్లు అరోన్ ఫించ్ (3), మార్కస్ హర్రీస్ (13)ల వికెట్లు కోల్పోయింది. ఫించ్‌ను జడేజా ఔట్ చేయగా.. హర్రీస్‌ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖాజా (33), షాన్ మార్ష్(44)లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ షమీ, బుమ్రాలు వీరిని ఔట్ చేసి దెబ్బకొట్టారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ (34), మిచెల్ మార్ష్ (10), టిమ్‌పైన్ (26)లు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేసినప్పటికి భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. చివర్లో స్టార్క్ (18), లయన్(6 నాటౌట్)లతో కలిసి కమిన్స్ 82 పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో జడేజా మూడు, షమీ 2, బుమ్రా 2 వికెట్లు తీయగా ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్ 443/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 106/8 డిక్లేర్డ్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 151 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 258/8