భారత్‌కు వరుసగా రెండో ఓటమి 

India Lost Second Match In Pro Hockey Second League - Sakshi

ప్రొ హాకీ లీగ్‌ సీజన్‌–2

భువనేశ్వర్‌: ప్రొ హాకీ లీగ్‌ రెండో సీజన్‌లో భారత పురుషుల జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గత మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్‌ బెల్జియం చేతిలో భంగపడ్డ భారత్‌... శుక్రవారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 3–4 గోల్స్‌ తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడింది. భారత్‌ తరఫున రాజ్‌ కుమార్‌ (36వ, 47వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... రూపిందర్‌ సింగ్‌ (52వ నిమిషంలో) ఒక గోల్‌ చేశాడు. ఆసీస్‌ తరఫున డైలాన్‌ (6వ నిమిషంలో), టామ్‌ (18వ నిమిషంలో), లెచ్లాన్‌ (41వ నిమిషంలో), జాకబ్‌ (42వ నిమిషంలో) తలా ఒక గోల్‌ చేశారు. మ్యాచ్‌ మొదటి మూడు క్వార్టర్స్‌లో పెద్దగా ప్రభావం చూపని భారత ఆటగాళ్లు చివరి క్వార్టర్‌లో పుంజుకున్నారు. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి ఆసీస్‌ ఆధిక్యాన్ని 3–4కు తగ్గించారు. ఆట మరో 35 సెకన్లలో ముగుస్తుందనగా లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌ గా మలచడంలో భారత ప్లేయర్లు విఫలమవ్వడం తో కంగారూల గెలుపు ఖాయమైంది. నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ రెండో లీగ్‌ మ్యాచ్‌ను ఆడనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top