వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌కు భారత్‌

India Defeat Pakistan To Reach Davis Cup World Group Qualifiers - Sakshi

పాకిస్తాన్‌పై 4–0తో టీమిండియా గెలుపు

పేస్‌ ఖాతాలో 44వ డబుల్స్‌ విజయం  

నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌): చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్‌ తమ అజేయ రికార్డును కొనసాగించింది. తటస్థ వేదికపై జరిగిన ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ మ్యాచ్‌లో భారత్‌ 4–0తో విజయం సాధించింది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. మార్చి 6,7 తేదీల్లో జరిగే వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో... గతంలో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన క్రొయేíÙయా జట్టుతో భారత్‌ తలపడుతుంది. తొలి రోజు శుక్రవారం రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో అలవోకగా నెగ్గిన భారత ఆటగాళ్లకు రెండో రోజు శనివారం డబుల్స్‌ మ్యాచ్‌లో, రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లోనూ ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు.

తొలుత డబుల్స్‌ మ్యాచ్‌లో భారత దిగ్గజం లియాండర్‌ పేస్‌–జీవన్‌ నెడుంజెళియన్‌ ద్వయం 6–1, 6–3తో మొహమ్మద్‌ షోయబ్‌–అబ్దుల్‌ రెహా్మన్‌ హుజైఫా జంటపై గెలిచింది. దాంతో ఐదు మ్యాచ్‌ల ఈ పోటీలో భారత్‌ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట నాలుగుసార్లు పాక్‌ జోడీ సరీ్వస్‌ను బ్రేక్‌ చేసింది. 1990లో డేవిస్‌ కప్‌లో అరంగేట్రం చేసిన 46 ఏళ్ల లియాండర్‌ పేస్‌ ఈ మెగా టోర్నీలో తన డబుల్స్‌ విజయాల సంఖ్యను 44కు పెంచుకున్నాడు. డేవిస్‌ కప్‌ చరిత్రలో అత్యధిక డబుల్స్‌ విజయాలు సాధించిన ప్లేయర్‌గా లియాండర్‌ పేస్‌ (43 విజయాలు) గత ఏడాది ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

నికోలా పెట్రాన్‌గెలి (ఇటలీ–42 విజయాలు) పేరిట ఉన్న రికార్డును పేస్‌ అధిగమించాడు. రివర్స్‌ సింగిల్స్‌లో సుమీత్‌ నాగల్‌ 6–1, 6–0తో యూసుఫ్‌ ఖలీల్‌పై గెలిచి భారత్‌కు 4–0 ఆధిక్యాన్ని అందించాడు. ఫలితం తేలిపోవడంతో నామమాత్రమైన ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. ఈ గెలుపుతో ముఖాముఖి రికార్డులో భారత్‌ 7–0తో పాకిస్తాన్‌పై ఆధిక్యంలోకి వెళ్లింది. 2014 ఫిబ్రవరిలో చైనీస్‌ తైపీపై 5–0తో గెలిచాక భారత జట్టు ఓ డేవిస్‌ కప్‌ పోటీలో అన్ని మ్యాచ్‌ల్లో నెగ్గడం ఇదే తొలిసారి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top