అదరగొట్టారు.. సిరీస్‌ పట్టారు

IND VS WI T20 Series: Team India Clinch The Series - Sakshi

ముంబై: టీమిండియా ఖాతాలో మరో సిరీస్‌ విజయం చేరింది. అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న కోహ్లి సేన వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. నిర్ణయాత్మకమైన చివరి టీ20లో అన్ని రంగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా విజయ ఢంకా మోగించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో  కైవసం చేసుకుంది. కోహ్లి సేన నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యంతో  బరిలోకి దిగిన విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులకే పరిమితమైంది. దీంతో 67 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ ఘోర ఓటమి చవిచూసింది. 

వెస్టిండీస్‌ ఆటగాళ్లలో కీరన్‌ పొలార్డ్‌ (39 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా.. హెట్‌మైర్‌ (24 బంతుల్లో 41; 1ఫోర్‌, 5 సిక్సర్లు) ఉన్నంత సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ మినహా మరే విండీస్‌ ప్లేయర్‌ కనీస పోరాటం కూడా చేయలేదు. టీమిండియా బ్యాటింగ్‌ సందర్భంగా ఎవిన్‌ లూయీస్‌ గాయపడటంతో అతడు బ్యాటింగ్‌కు దిగలేదు. దీంతో విండీస్‌కు భారీ నష్టం వాటిల్లింది. లూయిస్‌ ఉంటే మ్యాచ్‌ పరిస్థితి కాస్త భిన్నంగా ఉండేది. 

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు మంచి శుభారంభం లభించలేదు. ఓపెనర్లుగా వచ్చిన సిమన్స్‌(7), కింగ్‌(5)లతో పాటు నికోలస్‌ పూరన్‌(0)లు వెంటవెంటనే ఔటవ్వడంతో 17 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో పొలార్డ్‌తో కలిసి హెట్‌మైర్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 74 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.   అయితే వీరిద్దరినీ కుల్దీప్‌ ఔట్‌ చేయడంతో టీమిండియా విజయం ఖాయమైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌, షమీ, చహర్‌, కుల్దీప్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

సిరీస్‌ విజేతను డిసైడ్‌ చేసే మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ శివమెత్తారు. వెస్టిండీస్‌ బౌలర్లను ఊచకోత కోశారు. దీంతో పర్యాటక కరీబియన్‌ జట్టుకు టీమిండియా 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(56 బంతుల్లో 91; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్‌ శర్మ(34 బంతుల్లో 71; 6ఫోర్లు, 5 సిక్సర్‌) తొలి వికెటకు 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి శుభారంభం అందించారు. అనంతరం సారథి కోహ్లి (29 బంతుల్లో 70 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) హిట్టింగ్‌కు నిర్వచనం చెబుతూ విశ్వరూపం ప్రదర్శించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో విలియమ్స్‌, కాట్రెల్‌, పొలార్డ్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top