మూడేళ్లుగా కోహ్లినే.. ఈసారి రోహిత్‌ సాధిస్తాడా?

Ind vs WI: Rohit Threatens Virat Kohli's Three Year Domination - Sakshi

హైదరాబాద్‌:  గత మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లను కలుపుకుని పరుగుల పరంగా టాప్‌లో కొనసాగుతూ వస్తున్నది ఎవరంటే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినే. వరుసగా మూడేళ్లపాటు తన ఆధిపత్యాన్ని సాగిస్తూ వస్తున్న కోహ్లికి ఇప్పుడు సహచర ఆటగాడు రోహిత్‌ శర్మ నుంచే తీవ్ర పోటీ ఎదురుకానుంది.  ఈ ఏడాది కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిసి(అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో) 2,183 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో రోహిత్‌ శర్మ(2,090) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మూడో స్థానంలో పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌(1820) మూడో స్థానంలో నిలిచాడు. అయితే ప్రస్తుతం కోహ్లి-రోహిత్‌ల మధ్య బ్యాటింగ్‌ పోటీ షురూ కావడం ఖాయంగానే కనబడుతోంది. పెద్దగా వీరి మధ్య పరుగుల వ్యత్యాసం భారీగా లేకపోవడంతో పరుగుల మెషీన్‌ కోహ్లికి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ చెక్‌ పెట్టినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.(ఇక్కడ చదవండి: మెరిసేదెవరో... మెప్పించేదెవరో?)

ఇంకా ఈ ఏడాది భారత్‌ ఆడే మ్యాచ్‌లు ఆరే. అందులో ఆరు కూడా విండీస్‌పైనే. ఒకటి మూడు టీ20 సిరీస్‌ అయితే, ఇంకొటి మూడు వన్డేల సిరీస్‌. ఈ రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఎవరైతే రాణిస్తారో వారే టాప్‌లో నిలిచే అవకాశం ఉంది.  టీ20ల్లో ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ సక్సెస్‌ అయితే కోహ్లికి పెద్దగా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉండదు. అదే సమయంలో రోహిత్‌ విఫలమై, కోహ్లి ఫస్ట్‌ డౌన్‌లో వచ్చి బ్యాట్‌ ఝుళిపిస్తే తన రికార్డును కాపాడుకోనే అవకాశం ఉంటుంది. ఇక విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో కూడా వీరి ప్రదర్శనపైనే టాప్‌ ఆధారపడి వుంటుంది. కోహ్లి రెండు సిరీస్‌ల్లో సక్సెస్‌ అయితే అతని రికార్డుకు ఎటువంటి ఢోకా ఉండదు. కోహ్లి విఫలమైన పక్షంలో రోహిత్‌ విశేషంగా రాణిస్తే 2019 పరుగుల వీరుడిగా నిలుస్తాడు. ఇద్దరూ ఫామ్‌లోనే ఉండటంతో టాప్‌పై ఆసక్తి నెలకొంది.  2016 నుంచి కోహ్లినే ప్రతీ ఏడాది అత్యధిక పరుగుల జాబితాలో టాప్‌లో నిలుస్తున్నాడు.  2016లో 2,595 పరుగులతో అగ్రస్థానంలో నిలిచిన కోహ్లి.. 2017లో 2,818 పరుగులతో, 2018లో 2,735 పరుగులతో టాప్‌ను నిలబెట్టుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top