గెలిచారు.. సిరీస్‌ను ముద్దాడారు

IND VS AUS 3rd ODI: Team India Won By 7 Wickets - Sakshi

సెంచరీతో కదం తొక్కిన రోహిత్‌

హాఫ్‌ సెంచరీతో రాణించిన కోహ్లి

మూడు వన్డేల సిరీస్‌ టీమిండియా కైవసం

బెంగళూరు : మూడు వన్డేల సిరీస్‌ విజేతను డిసైడ్‌ చేసే మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. కలిసొచ్చిన మైదానంలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా ముద్దాడింది. అంతేకాకుండా కొత్త ఏడాదిలో రెండో సిరీస్‌ విజయంతో టీమిండియా తన విజయపరంపర కొనసాగించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని కోహ్లి సేన 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ(119, 128 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్సర్లు) శతక్కొట్టాడు. రోహిత్‌కు తోడు సారథి విరాట్‌ కోహ్లి (89; 91 బంతుల్లో 8ఫోర్లు) విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో శ్రేయస్‌ అయ్యర్‌ (44నాటౌట్‌, 35 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సర్‌) బ్యాట్‌ ఝుళిపించి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆసీస్‌ బౌలర్లలో అగర్‌, జంపా, హజల్‌వుడ్‌లు తలో వికెట్‌ పడగొట్టారు. 

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(3), పించ్‌(19) నిరుత్సాహపరిచినప్పటికీ.. స్టీవ్‌ స్మిత్‌(131; 132 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్‌) సెంచరీతో ఆదుకున్నాడు. స్మిత్‌కు తోడు లబుషేన్‌(54) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 127 పరుగులు జోడించి జట్టుకు మంచి స్కోర్‌ సాధించడంలో బాటలు వేశారు. ఇక చివర్లో అలెక్స్‌ క్యారీ(35) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. దీంతో టీమిండియా ముందు ఆసీస్‌ మంచి స్కోర్‌ను నిలిపింది. ఇక భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ నాలుగు వికెట్లతో రాణించగా.. జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top