సబ్సిడీపై ‘బీరు’ అందజేస్తాం!

ICC Offers Subsidy On Beer For World Cup Audience - Sakshi

లండన్‌ : క్రికెట్‌ మైదానంలో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ చూస్తూ చేతిలో చల్లని బీరు గ్లాసు ఉంటే ప్రేక్షకులకు ఆ మజాయే వేరు!  అయితే త్వరలో జరగబోయే వన్డే వరల్డ్‌ కప్‌లో అఫీషియల్‌ బీర్‌ పార్ట్‌నర్‌ పెట్టిన రేటుతో మద్యం గొంతు దిగడం కష్టంగా అనిపించింది. అంతే... మీరెందుకు బాధ పడుతున్నారు మేమున్నాం కదా అంటూ నేరుగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)నే రంగంలోకి దిగింది. టోర్నీ నిర్వాహక దేశం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)తో కలిసి బీరు ధరను కిందకు దించింది. అదేమీ చర్చలతో కాదు... మీరు కోల్పోయే మొత్తాన్ని మేం చెల్లిస్తాం కానీ తక్కువ ధరకే స్టేడియాల్లో బీర్లు అందించండని సదరు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

సబ్సిడీ బీరు కథ వివరాల్లోకెళితే... వరల్డ్‌ కప్‌ అధికారిక బీర్‌ స్పాన్సర్‌గా భారత్‌కు చెందిన ‘బీరా 91’ కంపెనీతో ఐసీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు జరిగే 11 వేదికల్లో ఇదే బీరును అమ్మాలి. నిర్వాహకులు ఒక బీరు పింట్‌ (గ్లాసు) ధరను 9.70 డాలర్లు (సుమారు రూ. 670)గా నిర్ణయించారు. అయితే అక్కడి వ్యాపారులు మాత్రం ఇది తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని, కనీసం 15.5 డాలర్లు (సుమారు రూ.1000) ఉంటే గాని కుదరదని తేల్చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చే అభిమానులను బీరు రేటుతో నిరాశపర్చడం ఇష్టం లేని ఐసీసీ...ఫ్యాన్స్‌కు తక్కువ రేటుకే ఇవ్వండి, మిగిలిన నష్టాన్ని మేం పూరిస్తాం అని హామీ ఇచ్చింది. దీని ప్రకారం మొత్తం దాదాపు 5 లక్షల పౌండ్ల (రూ. 4 కోట్ల 52 లక్షలు) సబ్సిడీ భారం పడనుంది. దీనిని ఐసీసీ, ఇంగ్లండ్‌ బోర్డు సమంగా భరిస్తాయి. అంటే క్రికెట్‌ పెద్ద ఐసీసీ బీర్ల కోసం 2 లక్షల 50 వేల పౌండ్ల (రూ. 2 కోట్ల 26 లక్షలు) నష్టాన్ని భరించేందుకు సన్నద్ధమైంది!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top