ఐసీసీలో ‘ప్రత్యర్థి’ గుబులు! 

ICC fears formation of rebel cricket governing body - Sakshi

సమాంతర క్రికెట్‌ బోర్డు వచ్చే అవకాశముందని నివేదిక  

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఎప్పుడూ లేని సమస్యతో సతమతమవుతోంది. ఐసీసీకి పోటీగా సమాంతరంగా మరో క్రికెట్‌ వ్యవస్థ రాబోతోందని ఐసీసీ వ్యూహ బృందం (ఎస్‌డబ్ల్యూజీ) ఓ నివేదిక ఇచ్చింది. పీవెర్‌ (ఆసీస్‌), రాహుల్‌ జోహ్రి (భారత్‌), ఇమ్రాన్‌ ఖాజా (సింగపూర్‌), ప్యాట్రిసియా (దక్షిణాఫ్రికా), కామెరాన్‌ (విండీస్‌), మహిళా ప్రతినిధి క్లేర్‌ కానర్‌లు సభ్యులుగా ఉన్న ఈ బృందం ఇప్పటికే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది. ‘ఐసీసీకి ముప్పు పొంచి వున్న మాట వాస్తవమే. తలపండిన క్రికెట్‌ పాలకుడు, భారత్‌కు చెందిన ఓ టీవీ చానెల్, ఆస్ట్రేలియా లాయర్‌లు కలిసి ఐసీసీకి ప్రత్యర్థి దళాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.

‘ఆపరేషన్‌ వాటర్‌షెడ్‌’ పేరుతో ఈ తతంగమంతా సాగింది’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సమాంతర క్రికెట్‌ సమాఖ్య ఏర్పాటే లక్ష్యంగా ఆటగాళ్లకు కోట్ల రూపాయలు ఎరవేసినా ఈ ప్రాజెక్ట్‌ మాత్రం కార్యరూపం దాల్చలేదని... భవిష్యత్తులో ఏర్పాటయ్యే విషయాన్ని కొట్టిపారేయలేమని ఆ అధికారి తెలిపారు. నిషేధానికి గురైన ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోడీ ఆధ్వర్యంలో 2016లోనే ఈ వ్యవహారం జరిగినట్లు వెలుగుచూసింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా టి20 లీగ్‌తో ఐసీసీ వైరీ వర్గం పురుడుపోసుకునేందుకు సిద్ధమవుతోంది. యూఏఈలో గత డిసెంబర్‌లో జరిగిన ఈ టోర్నీలో మోర్గాన్, మాలిక్, బ్రేవోలు పాల్గొన్నారు. దీంతో ప్రత్యర్థి వర్గం ఈ తరహా లీగ్‌పై ఆశలు పెట్టుకొని పావులు కదుపుతున్నట్లు ఐసీసీ ఆందోళన చెందుతోంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top