వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

ICC Breaks Silence on Ben Stokes Overthrows Incident - Sakshi

ఓవర్‌త్రో వివాదంపై మాట్లాడటానికి నిరాకరణ

దుబాయ్‌: ప్రపంచకప్‌ ఫైనల్లో చోటుచేసుకున్న ఓవర్‌ త్రో వివాదంపై మాట్లాడటానికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నిరాకరించింది. మైదానంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌ అని స్పష్టం చేసింది. ఆదివారం ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ఈ ఫైనల్‌ మ్యాచ్‌ సస్పన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓవర్‌ త్రో ద్వారా ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు రావడం ప్రపంచకప్‌ ఫైనల్‌ డ్రామాలో కీలక ఘట్టం. 50వ ఓవర్లో విజయం కోసం ఇంగ్లండ్‌ 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా నాలుగో బంతికి ఆరు పరుగులు లభించడంతో సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారిపోయింది. బౌల్ట్‌ వేసిన ఫుల్‌టాస్‌ను డీప్‌ మిడ్‌వికెట్‌ వైపు కొట్టిన స్టోక్స్‌ సింగిల్‌ను పూర్తి చేసి రెండో పరుగు కోసం పరుగెత్తాడు. ఫీల్డర్‌ గప్టిల్‌ విసిరిన త్రో నేరుగా స్టోక్స్‌ పరుగెడుతున్న వైపే దూసుకొచ్చి అతని బ్యాట్‌కే తగిలి బౌండరీని దాటింది. స్టోక్స్, రషీద్‌ చేసిన 2 పరుగులతో కలిపి అంపైర్‌ ధర్మసేన దానిని ‘6’గా ప్రకటించాడు. స్టోక్స్‌ ఉద్దేశపూర్వకంగా అడ్డు రాలేదు కాబట్టి తప్పు లేదు కానీ ఆరు పరుగులు ఇవ్వడాన్ని ప్రఖ్యాత మాజీ అంపైర్‌ సైమన్‌ టఫెల్‌ తప్పు పట్టారు.

‘నిబంధన 19.8 ప్రకారం ఫీల్డర్‌ త్రో సంధించిన సమయంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ పిచ్‌పై ఒకరిని మరొకరు దాటితేనే రెండో పరుగును లెక్కించాలి. వీడియో రీప్లేలో చూస్తే ఫీల్డర్‌ బంతిని విసిరినప్పుడు వీరిద్దరు ఒకరిని మరొకరు దాటలేదు. కాబట్టి బౌండరీతో పాటు సింగిల్‌నే అనుమతించాల్సింది. అప్పుడు ఒక పరుగు తగ్గడంతో పాటు రషీద్‌ స్ట్రయికింగ్‌ తీసుకోవాల్సి వచ్చేది’ అని టఫెల్‌ వివరించారు. అయితే తాను అంపైర్‌ను విమర్శించడం లేదని, అదంతా ఆ సమయంలో మైదానంలో ఉండే ఉద్వేగాలు, వేడిలో అలాంటిది జరిగిపోయిందని అన్నారు. ‘స్టోక్స్‌ పరుగు పూర్తి చేసే స్థితిలో ఉన్నాడని అంపైర్‌ భావించి ఉండవచ్చు. ఈ నిర్ణయం ప్రభావం మ్యాచ్‌పై కొంత మేరకు ఉన్నా, తుది ఫలితానికి ఇది మాత్రం కారణం కాదు’ అని టఫెల్‌ అభిప్రాయపడ్డారు. 

ఈ విషయాన్ని ఐసీసీ ముందు మీడియా ప్రస్తావించగా.. మాట్లాడటానికి నిరాకరించింది.‘  నిబంధనలపై అంపైర్లుకు ఉన్న అవగాహన మేరకు మైదానంలో వారు నిర్ణయాలు తీసుకుంటారు. అలా తీసుకున్న ఏ నిర్ణయాలపైనా అయినా నిబంధనల ప్రకారం మేం మాట్లాడలేం’ అని ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top