‘యువీ.. నువ్వు ఇంకా ఆడతావనుకున్నా’

I hope You Played A Little Longer, Rohit Tells Yuvraj - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌ రౌండర్‌గా అనేక చిరస్మరణీయ విజయాల్లో పాలు పంచుకున్న యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి ఏడాది పూర్తయిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం యువీతో తొలి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ స్పందించాడు. ‘యువీ రిటైర్మెంట్‌ ప్రకటించి ఏడాది పూర్తయ్యింది. చెన్నై క్యాంప్‌లో యువీతో నా తొలి జ్ఞాపకం. అప్పుడు యువీకి నేను ఏమీ సాయం చేయలేకపోయా.. కానీ అతనొక గ్రేట్‌ అథ్లెట్‌ అనే విషయాన్ని గుర్తించాను. అతని హిట్టింగ్‌ సామర్థ్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను ఎంత పెద్ద హిట్టర్‌ అనే విషయం ప్రపంచం చూసింది’ అని సచిన్‌ స్పందించగా, రోహిత్‌ శర్మ సైతం యువీ రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(నాపై నమ్మకం కల్గించావు: యువీ)

యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గతేడాదే వీడ్కోలు చెబుతాడని ఊహించలేదన్నాడు. ‘ నీతో నా జ్ఞాపకాలు అద్భుతం. నువ్వు గతేడాది రిటైర్మెంట్ ప్రకటిస్తావని అనుకోలేదు. ఇంకొంత కాలం జాతీయ జట్టు తరఫున ఆడతావనే భావించా’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో యువరాజ్‌ సింగ్‌ 40 టెస్టులు ఆడగా, 304 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 58 టీ20ల్లో యువీ ఆడాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2011లో వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో యువీ సభ్యుడిగా ఉండటమే కాకుండా ఆ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2019లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ గెలిచిన ఐపీఎల్‌లో యువీ సభ్యుడిగా ఉన్నాడు. (‘ప్లాన్‌-బితోనే క్రికెట్‌లోకి వచ్చా’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top