హైదరాబాద్‌ థండర్‌బోల్ట్స్‌కు మూడో స్థానం

Hyderabad placed third in ttl - Sakshi

ఒక పరుగుతో ఓడిన రంగారెడ్డి రైజర్స్‌

తెలంగాణ టి20 లీగ్‌

సాక్షి, హైదరాబాద్‌: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 లీగ్‌ను హైదరాబాద్‌ శ్రీనిధియాన్‌ థండర్‌బోల్ట్స్‌ జట్టు సంతృప్తిగా ముగించింది. జింఖానా మైదానంలో ఆదివారం రంగారెడ్డి రైజర్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన వర్గీకరణ మ్యాచ్‌లో థండర్‌బోల్ట్స్‌ కేవలం ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ లీగ్‌లో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

బౌలర్‌ రవికిరణ్‌ (3/30) అద్భుతమైన స్పెల్‌తో హైదరాబాద్‌కు విజయాన్నందించాడు. తొలుత బ్యాటింగ్‌లో డానీ ప్రిన్స్‌ (55 బంతుల్లో 104; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. విఠల్‌ అనురాగ్‌ (39 బంతుల్లో 50 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడాడు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన రంగారెడ్డి 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసి ఓటమి పాలైంది.

ఓపెనర్లు ప్రతీక్‌ పవార్‌ (38 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), అఖిల్‌ అక్కినేని (39 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగుల్ని జోడించారు. విజయానికి చివరి ఓవర్‌లో రంగారెడ్డి జట్టు 8 పరుగులు చేయాల్సి ఉండగా... రవికిరణ్‌ వేసిన తొలి బంతికి మెహదీ హసన్‌ సిక్స్‌ బాదడంతో రంగారెడ్డి విజయం ఖాయంగానే అనిపించింది. అయితే వెంటనే రవికిరణ్‌ రెండు వికెట్లు పడగొట్టడంతో పాటు మూడు డాట్‌ బాల్స్‌ వేయడంతో రంగారెడ్డికి ఓటమి తప్పలేదు. సెంచరీతో కదం తొక్కిన డానీ ప్రిన్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top