‘మిక్స్‌డ్‌’ ఫైనల్లో సిక్కి–ప్రణవ్‌ జంట  | Hyderabad Open: Pranaav, Sikki Reddy enter final | Sakshi
Sakshi News home page

‘మిక్స్‌డ్‌’ ఫైనల్లో సిక్కి–ప్రణవ్‌ జంట 

Sep 9 2018 1:26 AM | Updated on Sep 9 2018 1:26 AM

 Hyderabad Open: Pranaav, Sikki Reddy enter final - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కెరీర్‌లో మరో అంతర్జాతీయ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ సాధించేందుకు తెలంగాణ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సిక్కి రెడ్డి విజయం దూరంలో నిలిచింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం లో జరుగుతున్న హైదరాబాద్‌ ఓపెన్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) జంట మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ సిక్కి–ప్రణవ్‌ ద్వయం 21–19, 21–15తో చాంగ్‌ టక్‌ చింగ్‌–ఎన్జీ వింగ్‌ యంగ్‌ (హాంకాంగ్‌) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ 21–14, 21–6తో అరుణ్‌ జార్జి–సాన్యమ్‌ శుక్లా (భారత్‌) జంటను అలవోకగా ఓడించి ఫైనల్‌కు చేరింది. 

పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌  గురుసాయిదత్‌ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో గురుసాయిదత్‌ 21–16, 15–21, 11–21తో భారత్‌కే చెందిన సమీర్‌ వర్మ చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ఫైనల్స్‌లో పురుషుల డబుల్స్‌లో అక్బర్‌–ఇస్‌ఫహాని (ఇండోనేసియా) జంటతో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం... పురుషుల సింగిల్స్‌లో సూంగ్‌ జూ వెన్‌ (మలేసియా)తో సమీర్‌ వర్మ... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అక్బర్‌–వినీ ఒక్తవినా (ఇండోనేసియా) జోడీతో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంట తలపడతాయి.  

నేటి ఫైనల్స్‌ మధ్యాహ్నం గం. 2.00 నుంచి డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  

Advertisement
 
Advertisement
Advertisement