క్వార్టర్స్‌ బెర్త్‌ కొట్టేస్తారా? 

Hockey World Cup 2018, India vs Canada - Sakshi

కెనడాతో భారత్‌ పోరు నేడు

ప్రపంచకప్‌ హాకీ టోర్నీ

భువనేశ్వర్‌: ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో ఆకట్టుకునే ప్రదర్శనతో అడుగులు వేస్తున్న భారత్‌ నేడు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను తేల్చాలనుకుంటుంది. పూల్‌ ‘సి’లో శనివారం భారత్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో కెనడాతో తలపడనుంది. ఇందులో గెలిస్తే పూల్‌ టాపర్‌గా టీమిండియా నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సంపాదిస్తుంది. ఇదే పూల్‌లో రియో ఒలింపిక్స్‌ రన్నరప్‌ బెల్జియంతోపాటు 4 పాయింట్లతో ఉన్నప్పటికీ, గోల్స్‌ పరంగా భారతే అగ్రస్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం క్వార్టర్స్‌ కోసం క్రాస్‌ ఓవర్‌ నాకౌట్‌ మ్యాచ్‌ ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా గెలవాలనే పట్టుదలతో ఉంది. ముఖాముఖి పోరులో కెనడాతో భారత్‌కు మంచి రికార్డే ఉంది. 2013 నుంచి ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా... మూడు భారత్‌ గెలిస్తే, ఒక్కటి మాత్రమే కెనడా నెగ్గింది. మరో మ్యాచ్‌ ‘డ్రా’ అయింది. కలిసొచ్చే ఈ రికార్డుతో స్వదేశంలో జరుగుతున్న మెగా ఈవెంట్‌లో సత్తా చాటాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. ఫార్వర్డ్‌లో మన్‌దీప్‌ సింగ్,  సిమ్రన్‌జిత్‌ సింగ్, ఆకాశ్‌దీప్‌ సింగ్, లలిత్‌ ఉపాధ్యాయ్‌లు బాగా ఆడుతున్నారు.

మిడ్‌ ఫీల్డ్‌లో కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ ఫామ్‌లో ఉన్నప్పటికీ డిఫెన్స్‌ ఒత్తిడే జట్టును కలవరపెడుతోంది. మ్యాచ్‌ ముగిసేదశలో అనవసర ఒత్తిడికిలోనై గెలవాల్సిన మ్యాచ్‌లను చేజార్చుకుంటున్న భారత్‌కు డిఫెన్సే సవాలుగా మారింది. బీరేంద్ర లాక్రా, సురేందర్, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌లతో కూడిన రక్షణపంక్తి సమన్వయంతో బాధ్యత తీసుకుంటే సమస్యను అధిగమించవచ్చు.  మరోవైపు కెనడా జట్టు ఇటీవలి కాలంలో బాగా మెరుగైంది. డిఫెన్స్‌ దుర్బేధ్యంగా ఉంది. రియో ఒలింపిక్స్‌లో భారత్‌తో 2–2తో ‘డ్రా’ చేసుకున్న కెనడా గతేడాది ‘హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్స్‌’ టోర్నమెంట్‌లో 3–2తో భారత్‌ను ఓడించింది. తాజా ప్రపంచకప్‌ టోర్నీ లోనూ ఆకట్టుకుంది. తొలి మ్యాచ్‌లో మేటి జట్టయిన బెల్జియంను ఒకానొక దశలో చక్కగా నిలువరించింది. చివరకు 1–2తో ఓడినప్పటికీ ప్రదర్శనతో ఆకట్టుకుంది. దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌ను 1–1తో డ్రా చేసుకుంది. దీంతో భారత్‌ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా ఆద్యంతం పోరాడితేనే క్వార్టర్స్‌ బెర్తు సులువవుతుంది. లేదంటే క్వార్టర్స్‌ కోసం మరో మ్యాచ్‌ దాకా వేచిచూడాల్సిన పరిస్థితి వస్తుంది. శనివారం ఇదే పూల్‌లో  దక్షిణాఫ్రికాతో బెల్జియం తలపడనుంది.  

రాత్రి గం. 7 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌  సెలెక్ట్‌–1లో  ప్రత్యక్ష ప్రసారం   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top