‘వాకర్’ గుర్మీత్ కొత్త చరిత్ర | Gurmeet Singh wins gold at Asian Racewalking Championships | Sakshi
Sakshi News home page

‘వాకర్’ గుర్మీత్ కొత్త చరిత్ర

Mar 21 2016 12:33 AM | Updated on Sep 3 2017 8:12 PM

‘వాకర్’ గుర్మీత్ కొత్త చరిత్ర

‘వాకర్’ గుర్మీత్ కొత్త చరిత్ర

ఇప్పటికే రియో ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలను అందుకున్న ‘వాకర్’ గుర్మీత్ సింగ్ ఆదివారం కొత్త చరిత్ర సృష్టించాడు.

 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
 
నోమి (జపాన్): ఇప్పటికే రియో ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలను అందుకున్న ‘వాకర్’ గుర్మీత్ సింగ్ ఆదివారం కొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా 20 కిలోమీటర్ల రేస్ వాక్ చాంపియన్‌షిప్‌లో గుర్మీత్ స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 20 కిలోమీటర్ల నడక పోటీలో 30 ఏళ్ల గుర్మీత్ గంటా 20 నిమిషాల 29 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. ఇసాము ఫుజిసావా (జపాన్-1:20ని:49 సెకన్లు) రజతం సాధించగా... జియోర్జి షెకో (కజకిస్తాన్-1:21ని:52 సెకన్లు) కాంస్య పతకం దక్కించుకున్నాడు.

ఆసియా టైటిల్ సాధించి రియో ఒలింపిక్స్ సెలక్షన్ రేసులో తాను ముందున్నట్లు గుర్మీత్ నిరూపించాడు. 20 కిలోమీటర్ల నడక విభాగంలో భారత్ నుంచి తొమ్మిది మంది ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలను అందుకున్నారు. అయితే ఒక దేశం నుంచి ఈ రేసులో ముగ్గురికి మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. దాంతో తొమ్మిది మందికి సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించి ముగ్గురిని ఎంపిక చేస్తారు. మరోవైపు మహిళల 20 కిలోమీటర్ల నడక రేసులో భారత్‌కు చెందిన సప్నా నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement