ఒక్క ఓవర్‌లో 77 పరుగులా !

Former Cricketer Robert Vance Gave 77 Runs In 1Over In First Class Cricket  - Sakshi

వెల్లింగ్టన్‌ : క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే. ఎవరూ ఊహించని రికార్డులు బద్దలవడం, బౌలింగ్‌లో రికార్డు గణాంకాలు నమోదవడం వంటివి చూస్తూనే ఉంటాం.  సాధారణంగా ఒక బౌలర్ ఒక ఓవర్‌లో 6 నుంచి 10 పరుగులు ఇస్తుంటాడు. ఒకవేళ మరీ దారుణంగా బౌలింగ్‌ వేస్తే 30 పరుగులు ఇస్తుంటారు. అయితే ఒకే ఓవర్‌లో ఒక బౌలర్‌ 77 పరుగులు ఇవ్వడం ఎపప్పుడైనా విన్నారా ! అవును మీరు విన్నది అక్షరాల నిజం.. ఈ విచిత్ర ఘటన ఫిబ్రవరి 20, 1990 న చోటుచేసుకుంది. అయితే ఈ ఫేలవ రికార్డు అంతర్జాతీయ మ్యాచ్‌లో కాకుండా ఒక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో చోటుచేసుకుంది.

వివరాలు.. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే రోజున(ఫిబ్రవరి 20) వెల్లింగ్టన్‌, కాంటర్‌బరీ జట్ల మధ్య ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో కాంటర్‌బరీకి వెల్లింగ్టన్‌ 59 ఓవర్లలో 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో భాగంగా కాంటర్‌బరీ 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువయింది. ఆ సమయంలో క్రీజులో ఎల్‌కే జర్మన్‌ (160 నాటౌట్‌), రోజర్‌ ఫోర్డ్‌ (14 నాటౌట్‌) ఉన్నారు. ఇక కాంటర్‌బరీ గెలవడానికి 2 ఓవర్లలో 95 పరుగులు చేయాలి. ఇది అసాధ్యం కాబట్టి ఉన్న రెండు వికెట్లను కాపాడుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలని కాంటర్‌బరీ, మరోవైపు రెండు వికెట్లు తీస్తే.. విజయాన్ని సాధించవచ్చని వెల్లింగ్టన్‌ భావించాయి. దీంతో మ్యాచ్‌ను గెలవాలని వెల్లింగ్టన్‌ కెప్టెన్‌ మెక్‌ స్వీనే బంతిని బ్యాట్స్‌మన్‌ అయిన రాబర్ట్‌ వాన్స్‌కు ఇచ్చాడు. (‘రిషభ్‌.. నీ రోల్‌ ఏమిటో తెలుసుకో’)

అయితే రాబర్ట్‌ వాన్స్‌ ఆ ఓవర్‌లో ఏకంగా 22 బంతులు వేశాడు.. అందులో 17 నోబాల్స్ ఉండడం విశేషం. ఇక కాంటర్‌బరీ బ్యాట్స్‌మెన్‌ జర్మన్‌ ఎనిమిది సిక్సులు, ఐదు ఫోర్లు బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 77 పరుగులొచ్చాయి. ఈ క్రమంలోనే జర్మన్‌ సెంచరీ కూడా చేయడం విశేషం. ఈ ఓవర్‌ దెబ్బకు కాంటర్‌బరీ చివరి ఓవర్‌లో 18 పరుగులు చేస్తే విజయం దక్కించుకునేది. అప్పటికే సెంచరీతో జోరుమీదున్న జర్మన్‌ ఊపుచూస్తే.. కాంటర్‌బరీ సునాయాసంగా గెలిచేలాగా కనిపించింది. ఇవాన్‌ గ్రే వేసిన చివరి ఓవర్‌లో కాంటర్‌బరీ జట్టు 5 బంతుల్లో 17 పరుగులు చేసింది. కాగా ఇన్నింగ్స్‌ చివరి బంతిని ఎదుర్కొన్న రోజర్‌ ఫోర్డ్‌ సింగిల్‌ తీయకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో జర్మన్‌ వీరోచిత ఇన్నింగ్స్ వృధాగా మిగిలిపోయింది.

రాబర్ట్‌ వాన్స్‌ మాత్రం ఒక ఓవర్లో 77 పరుగులు ఇచ్చి చెత్త రికార్డును తన పేరున  లిఖించుకున్నాడు. అయితే ఈ చెత్త రికార్డు మాత్రం క్రికెట్ చరిత్ర రికార్డుల్లోకి ఎక్కలేదు. బహుశా భవిష్యత్తులో ఏ బౌలర్ కూడా ఒకే ఓవర్‌లో ఇన్ని పరుగులు ఇవ్వడేమో!. ఇప్పటికి క్రికెట్‌ చరిత్రలో ఒకే ఓవర్‌లో 77 పరుగులు ఇచ్చిన చెత్త రికార్డు మాత్రం రాబర్ట్‌ వాన్స్‌పైనే ఉంది. కాగా రాబర్ట్‌ వాన్స్‌ 135 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లతో పాటు న్యూజిలాండ్‌ తరపున  4 టెస్టులు, 8వన్డేలు ఆడాడు.(అతనేమీ సెహ్వాగ్‌ కాదు.. కానీ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top