ఒకటి కొలంబియా... రెండోది పోలండ్‌!

fifa world cup 2018:Colombia special story - Sakshi

గత విజేతలు లేని గ్రూప్‌ ‘హెచ్‌’

జపాన్, సెనెగల్‌ ముందడుగేస్తే గొప్పే  

ఏ జట్టుకీ చెప్పుకోదగ్గ చరిత్ర లేదు...మేటి కాకపోయినా మెరుపు ఆటగాళ్లైనా లేరు... ఒకటి ఓడినా, మరోటి గెలిచినా సంచలనమేం కాదు... ప్రపంచ కప్‌ను ఒక్కసారి కూడా అందుకోని... ఈసారైనా విజేతగా నిలుస్తాయన్న ఆశ లేని జట్లు... ఇలాంటివాటి సమాహారమే గ్రూప్‌ ‘హెచ్‌’!  ఇందులో పోలండ్, కొలంబియా ముందడుగేయొచ్చు... 

కొలంబియా 
ఎంతోమంది యువ ప్రతిభావంతులున్న జట్టు కొలంబియా. 2014లో క్వార్టర్స్‌కు చేరింది. ఆ ప్రదర్శనను పునరావృతం చేయగలదు. అయితే, క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో తడబడింది. బెర్తు ఖాయమయ్యేందుకు చివరి మ్యాచ్‌ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు వరుసగా రెండోసారి అర్హత సాధించింది. 
కీలకం: జేమ్స్‌ రోడ్రిగెజ్‌. అత్యంత ప్రతిభావంతుడు. 2014లో ఉరుగ్వేపై చేసిన గోల్‌కు ఫిఫా పురస్కారం దక్కింది. ప్రస్తుతం ఫామ్‌ అందుకునే ప్రయత్నంలో ఉన్నాడు.  
కోచ్‌: జోస్‌ పెకర్‌మాన్‌. అర్జెంటీనా దేశస్తుడు. కొలంబియా విజయాల వెనుక ఘనతంతా ఇతడిదే. 
ప్రపంచ ర్యాంక్‌: 16 
చరిత్ర: అయిదుసార్లు అర్హత సాధించింది. 2014లో క్వార్టర్స్‌కు చేరింది. 

పొలోమంటూ... పోలండ్‌  
పుష్కర కాలం తర్వాత అర్హత సాధించింది. 1974–86 మధ్య చక్కటి ప్రదర్శన కనబర్చి బలమైన జట్టుగా ఎదుగుతున్నట్లు కనిపించింది. కానీ, ప్రదర్శన దిగజారి తర్వాత మూడు ప్రపంచ కప్‌లకు క్వాలిఫై కాలేకపోయింది. 2002, 2006లలో గ్రూప్‌ దశ దాటలేదు. గత రెండు కప్‌లకూ దూరమైంది. కీలక ఆటగాళ్లైన రాబర్ట్‌ లెవాన్‌డౌస్కీ, జాకబ్‌ బ్లాస్జికౌస్కీలకు ఇదే చివరి కప్‌ కావడం... రష్యా దగ్గరగా ఉండటంతో అభిమానులు ఆ దేశానికి పొలోమంటూ ప్రయాణమయ్యే సన్నాహాల్లో ఉన్నారు. 2016 యూరో కప్‌లో క్వార్టర్స్‌కు చేరిన జట్టే ఇప్పుడూ ఉంది. నాడు చాంపియన్‌గా నిలిచిన పోర్చుగల్‌ చేతిలో పోలండ్‌ పోరాడి ఓడింది. మరోవైపు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో డెన్మార్క్‌ చేతిలో 4–0తో ఓడటం పోలండ్‌ డిఫెన్స్‌ బలహీనతలను బయటపెట్టింది. అయినప్పటికీ గ్రూప్‌లో మిగతా జట్లతో పోలిస్తే ముందడుగు వేసే అవకాశాలు దీనికే ఉన్నాయి. 
కీలకం: లెవాన్‌డౌస్కీ. 29 ఏళ్ల ఈ స్ట్రయికర్‌ దేశం తరఫున అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడు. అర్హత మ్యాచ్‌ల్లో 16 గోల్స్‌ కొట్టాడు. యూరప్‌ ఆటగాళ్లలో ఇదే అత్యధికం. మరో స్ట్రయికర్‌ బ్లాస్జికౌస్కీ (32) పైనా అంచనాలున్నాయి. 
కోచ్‌: ఆడమ్‌ నవాల్కా. ఆటగాడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ప్రత్యర్థులపై ఆధిపత్యం కోసం ఎదురుదాడి చేసేలా జట్టును తయారు చేశాడు. 
ప్రపంచ ర్యాంక్‌:
చరిత్ర: మొత్తం 8 సార్లు అర్హత సాధించింది. 1974, 82లలో మూడో స్థానంలో నిలిచింది. 

స్టార్లు లేని జపాన్‌ 
ఇతర జట్ల మాదిరిగా చెప్పుకొనేందుకు ఒక్క స్టార్‌ కూడా లేని జట్టు జపాన్‌. కానీ, షింజి కగావా, షింజి ఒకజాకి వంటి ఆటగాళ్లకు యూరోపియన్‌ లీగ్‌ల్లో ఆడిన విశేష అనుభవం ఉంది. సౌదీ అరేబియా, ఆస్ట్రేలియాలను పక్కకునెట్టి క్వాలిఫయింగ్‌ పోటీల గ్రూప్‌ బిలో టాప్‌లో నిలిచి ప్రపంచ కప్‌ బెర్తు కొట్టేసింది.  
కీలకం: షింజి కగావా. అనుభవజ్ఞుడైన మిడ్‌ ఫీల్డర్‌. ఇతడితో పాటు ఒకజాకి, యుటో నగమోటో, కిసుకి హోండా రాణిస్తే జపాన్‌ నాకౌట్‌ అవకాశాలు మెరుగుపడతాయి. 
కోచ్‌: వహిద్‌ హలిల్హొడ్జిక్‌. బోస్ని యా దేశస్తుడు. అల్జీరియా 2014 ప్రపంచ కప్‌నకు క్వాలిఫై కావ డంలో కీలక పాత్ర పోషించాడు.  
ప్రపంచ ర్యాంక్‌: 61 
చరిత్ర: 1998 నుంచి వరుసగా అర్హత సాధిస్తోంది. 2002, 2009లో 9వ స్థానంలో నిలవడం అత్యుత్తమం.

సంచలనాల సెనెగల్‌ 
కేవలం రెండోసారి అర్హత సాధించింది. 2002లో అడుగు పెడుతూనే అప్పటి డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. ఆ కప్‌లో క్వార్టర్స్‌ చేరిన ఏకైక ఆఫ్రికా జట్టుగా నిలిచింది. తర్వాత మూడు కప్‌లకు అర్హత పొందలేకపోయింది. ఈసారి ఫిఫా చొరవతో సంచలనాత్మక రీతిలో బెర్తు దక్కించుకుంది. దక్షిణాఫ్రికాతో క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో 2–1 తేడాతో సెనెగల్‌ ఓడింది. అయితే, రిఫరీ నిర్ణయాలపై అనుమానంతో ఫిఫా రీ మ్యాచ్‌ ఆడించింది. 2–0తో గెలుపొందిన సెనెగల్‌ ప్రపంచ కప్‌ కోసం ఫ్లైటెక్కింది. చురుకైన ఆటగాళ్లుండే సెనెగల్‌... మళ్లీ మళ్లీ సంచలనాలు సృష్టించే సత్తా ఉన్నదే. 
కీలకం: శాడియో మానె. వేగవంతమైన కదలికలకు పెట్టింది పేరు. జట్టులో అతి కీలక ఆటగాడు.  
కోచ్‌: అలీయు సిసె. 2002 కప్‌లో జట్టు కెప్టెన్‌. ఇప్పుడు కోచ్‌గా అతడి ఆధ్వర్యంలోనే రెండోసారి అర్హత సాధించడం విశేషం. 
ప్రపంచ ర్యాంక్‌: 27 
చరిత్ర: 2002లో క్వార్టర్స్‌కు చేరింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top