5 ఏళ్లు.. 2 బంతులు: ఏం సెలక్షన్‌రా నాయనా!

Fans Slam BCCI Selectors As Sanju Samson Snubbed - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా తరఫున సుమారు ఐదేళ్ల తర్వాత టీ20ల్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఆటగాడు సంజూ సామ్సన్‌. ఈ క్రమంలోనే అత్యధిక టీ20 మ్యాచ్‌లను మిస్సయ్యింది కూడా సామ్సనే. తన అరంగేట్రం తర్వాత మరొక టీ20 ఆడటానికి సామ్సన్‌ కోల్పోయిన మ్యాచ్‌ల సంఖ్య 73. ఇక్కడ సామ్సన్‌ ఇక్కడ మిస్‌ అయ్యాడు అనే కంటే బీసీసీఐనే అతన్ని పక్కన పెట్టింది అంటే సబబు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ వచ్చిన తర్వాత సెలక్షన్‌ కమిటీ తీరు మారుతుందని అనుకుంటే అది మాటలకే పరిమితమైంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కేవలం చివరి మ్యాచ్‌లో సామ్సన్‌కు అవకాశం ఇచ్చిన మేనేజ్‌మెంట్‌.. మళ్లీ సామ్సన్‌ను పక్కనపెట్టిసేంది. లంకేయులతో ఆఖరి మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్‌ కొట్టిన సామ్సన్‌.. ఆ తర్వాత బంతికి వికెట్లు ముందు దొరికిపోయాడు. అప్పుడే సామ్సన్‌ వచ్చిన చాన్స్‌ మిస్‌ చేసుకున్నాడని భారత అభిమానులు అనుకున్నారు. కానీ ఐదేళ్ల విరామం తర్వాత సామ్సన్‌ ఆడింది రెండు బంతులే కదా.. సెలక్టర్లు మరొకసారి చాన్స్‌ ఇస్తారులే అనుకున్న అభిమానులకు ఊహించని షాకిచ్చారు.(ఇక‍్కడ చదవండి: సామ్సన్‌ చాలా మిస్సయ్యాడు..!)

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఆదివారం ఎంపిక చేసిన జట్టులో సామ్సన్‌కు ఉద్వాసన పలికారు. అంతకుముందు ఆసీస్‌తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఉన్నాడా అంటే అదీ లేదు. ఇక్కడ రెండు చోట్ల వరుస అవకాశాలు దక్కించుకుంటున్న రిషభ్‌ పంత్‌వైపే ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్టర్లు మొగ్గుచూపారు. ఇప్పుడు ఇదే బీసీసీఐని విమర్శల  పాలు చేస్తోంది. ఐదేళ్ల తర్వాత జట్టులో చోటిచ్చి కేవలం రెండు బంతులను మాత్రమే పరిగణలోకి తీసుకుని సామ్సన్‌ను పక్కన పెట్టడం ఏమిటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది బీసీసీఐకు న్యాయమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. సామ‍్సన్‌ వేటుపై పలువురు నెటిజన్లు ఏమని ట్వీట్‌ చేశారో చూద్దాం.. 

‘చాలా బాగుంది.. ఐదేళ్ల విరామం తర్వాత చోటిచ్చారు.. రెండు  బంతులు ఆడే అవకాశం ఇచ్చారు.. అప్పుడే పక్కన పెట్టేశారు అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ‘ రిషభ్ పంత్‌ ఎలాంటి ప్రదర్శన చేసినా అతనే మా ఫస్ట్‌ చాయిస్‌ అన్నట్లు ఉంది  సెలక్టర్ల పరిస్థితి. సంజూ సామ్సన్‌ను మరో ఐదేళ్లు ఆగమని చెప్పండి’ అంటూ మరొక అభిమాని ఎద్దేవా చేశాడు. ‘చెత్త సెలక్షన్‌తోనే టీమిండియా మెగా టోర్నీలను గెలవడంలో విఫలం అవుతుంది. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ను కూడా గెలవలేరు’ అని మరొకరు ట్వీట్‌ చేశారు. ‘ టీ20ల్లో అవసరం లేని శిఖర్‌ ధావన్‌ను పదే పదే ఎంపిక చేస్తున్న సెలక్టర్లు.. సంజూ సామ్సన్‌పై వివక్ష ఎందుకు చూపెడుతున్నారు’ అని మరొక అభిమాని విమర్శించాడు. (ఇక్కడ చదవండి: సామ్సన్‌పై వేటు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top