ఇంగ్లండ్‌ బొక్కబోర్లా

England skittled for 58 after spectacular first-day collapse - Sakshi

58 పరుగులకే ఆలౌట్‌

నిప్పులు చెరిగిన బౌల్ట్‌ (6/32)

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు  

ఆక్లాండ్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌ చెత్త ప్రదర్శన ఇంకా కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మొదటి టెస్ట్‌లో ఆడుతోంది టెస్ట్‌ మ్యాచా లేక టి20నా అనే అనుమానం వచ్చేలా తొలి రోజు తొలి సెషన్‌ కూడా పూర్తి కాకముందే ఆ జట్టు ఆలౌటైంది. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన ఇంగ్లీష్‌ జట్టు... కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (6/32) ధాటికి కేవలం 20.4 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఒవర్టన్‌ (25 బంతుల్లో 33 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో ధాటిగా ఆడటంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌల్ట్‌కు తోడు టిమ్‌ సౌథీ (4/25) నిప్పులు చెరగడంతో ఐదుగురు ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్‌ ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. కివీస్‌పై ఇంగ్లండ్‌కు ఇదే అత్యల్ప స్కోరు. ఓవరాల్‌గా టెస్ట్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు ఇది ఆరో అత్యల్పం. ఈడెన్‌ పార్క్‌ (ఆక్లాండ్‌) వేదికగా గురువారం ప్రారంభమైన డే–నైట్‌ టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 94 నిమిషాల్లోనే ముగిసింది.

కివీస్‌ పేసర్లు బౌల్ట్, సౌథీ ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించారు. వీరిద్దరి ధాటికి ఓ దశలో 27 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసేలా కనిపించినా... చివరి వికెట్‌కు ఒవర్టన్, అండర్సన్‌ 31 పరుగులు జోడించి కాస్త పరువు నిలిపారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి... తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం సాధించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (91 బ్యాటింగ్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. అతనితో పాటు నికోల్స్‌ (24 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో అండర్సన్‌ 2, బ్రాడ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 6 పరుగుల వద్ద సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అలిస్టర్‌ కుక్‌ (5) వికెట్‌ కోల్పోయింది. అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. ఆ తర్వాత కెప్టెన్‌ జో రూట్‌ (0)ఖాతా తెరవకుండానే వెనుదిరగగా... మలాన్‌ (2), స్టోన్‌మన్‌ (11) అతన్ని అనుసరించారు. ఆరు నెలల తర్వాత టెస్టు క్రికెట్‌లో పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ (0), వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టో (0), మొయిన్‌ అలీ (0)లు కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. టెయిలెండర్లు వోక్స్‌ (5), బ్రాడ్‌ (0) అవుటైనా... అండర్సన్‌ (1)తో కలిసి ఒవర్టన్‌ జట్టు స్కోరు 50 పరుగులు దాటించాడు.  

400 వికెట్ల క్లబ్‌లో బ్రాడ్‌....
టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 400 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ స్థానం దక్కించుకున్నాడు. 115వ టెస్ట్‌ ఆడుతోన్న ఈ ఇంగ్లీష్‌ బౌలర్‌ కివీస్‌ బ్యాట్స్‌మన్‌ టామ్‌ లాథమ్‌ వికెట్‌ పడగొట్టి అందరికంటే పిన్న వయసు (31 ఏళ్ల 271 రోజులు)లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అండర్సన్‌ (525) తర్వాత 400 వికెట్ల మైలురాయిని దాటిన రెండో ఇంగ్లండ్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన బ్రాడ్‌...ఓవరాల్‌గా ఈ జాబితాలో 15వ బౌలర్‌.

►ఇంగ్లండ్‌ టెస్టు చరిత్రలో ఇది (58) ఆరో అత్యల్ప స్కోరు కాగా, ఆ జట్టు ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌ కావడం 1976 తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఎదుర్కొన్న ఓవర్ల ప్రకారం చూస్తే ఈ ఇన్నింగ్స్‌ (20.4 ఓవర్లు) ఇంగ్లండ్‌కు మూడో అతి చెత్త ప్రదర్శన. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో మొదటి 9 వికెట్లకు 27 పరుగులు జోడిస్తే... చివరి వికెట్‌కు 31 పరుగులు జత చేసింది. 

►6/32  బౌల్ట్‌ కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన.   

►ఇద్దరు బౌలర్లు మాత్రమే బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయడం 1994 (లంకపై అక్రమ్, వకార్‌) తర్వాత ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌ తరఫున ఇదే మొదటి సారి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top