సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌

England And South Africa Entered Into Semi Finals In Womens ICC T20 WC - Sakshi

మహిళల టి20 ప్రపంచకప్‌

సిడ్నీ: ‘హ్యాట్రిక్‌’ విజయంతో దక్షిణాఫ్రికా... మూడో గెలుపుతో ఇంగ్లండ్‌ జట్లు మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 17 పరుగుల ఆధిక్యంతో పాకిస్తాన్‌పై... ఇంగ్లండ్‌ 46 పరుగుల ఆధిక్యంతో వెస్టిండీస్‌పై గెలుపొందాయి. గ్రూప్‌ ‘బి’లో తమ నాలుగు లీగ్‌ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న ఇంగ్లండ్‌ మూడు విజయాలతో ఆరు పాయింట్లు సంపాదించింది. దక్షిణాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో ఇంగ్లండ్‌తో సమఉజ్జీగా ఉంది. అయితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ఇంగ్లండ్‌ ఈ గ్రూప్‌లో టాప్‌ ర్యాంక్‌లో ఉంది. మంగళవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడిస్తే దక్షిణాఫ్రికా గ్రూప్‌ టాపర్‌గా నిలుస్తుంది.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. లారా వోల్వార్ట్‌ (36 బంతుల్లో 53 నాటౌట్‌; 8 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. మారిజన్‌ కాప్‌ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్‌) కూడా రాణించింది. 137 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 119 పరుగులు చేసి ఓడిపోయింది. జవేరియా ఖాన్‌ (31; 4 ఫోర్లు), అలియా రియాజ్‌ (39 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించినా ఫలితం లేకపోయింది. మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేసింది. నటాలీ షివెర్‌ (56 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. అనంతరం వెస్టిండీస్‌ 17.1 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. సోఫీ ఎకిల్‌స్టోన్‌ 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బతీసింది.  

నేటి గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌తో శ్రీలంక; ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ విజేత ఈ గ్రూప్‌ నుంచి రెండో జట్టుగా సెమీఫైనల్‌ చేరుకుంటుంది. గ్రూప్‌ ‘ఎ’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచి భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్‌ చేరుకున్న సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top