
జకార్తా: ఏషియన్ గేమ్స్-2018లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తొలి రోజు పసిడి, కాంస్య పతకాలు సాధించిన భారత్.. రెండో రోజు రజత పతకం సాధించింది. సోమవారం ఉదయం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఈవెంట్‌లో దీపక్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. ఆఖరి రౌండ్‌లో 10.9 పాయింట్లు సాధించిన దీపక్ కుమార్.. మొత్తంగా 247.7 పాయింట్ల సాధించి రజతాన్ని ఖాయం చేసుకున్నాడు.
కాగా, ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్ రవి కుమార్ నాల్గో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చైనాకు చెందిన యాంగ్ హారాన్ 249.1 పాయింట్లతో స్వర్ణ పతకాం సాధించాడు. ఫలితంగా ఆసియన్ గేమ్స్‌లో తన డిఫెండింగ్ చాంపియన్‌షిప్ హోదాను నిలబెట్టుకున్నాడు. ఇక చైనీస్ తైపీకి చెందిన లు సాచువాన్ 226.8 పాయింట్లతో కాంస్య పతకం సాధించాడు.
తొలి రోజు బజరంగ్ మినహా మిగతా భారత రెజ్లర్లు సందీప్, సుశీల్ కుమార్, పవన్, మౌజమ్ ఖత్రి పతకం నెగ్గడంలో విఫలమయ్యారు. మరోవైపు షూటింగ్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో రవికుమార్–అపూర్వీ చండేలా ద్వయం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: బజరంగ్ బంగారం