క్రీడా కార్యక్రమాలకు ‘కరోనా’ అంతరాయం

Coronavirus Disrupts International Sports Events - Sakshi

బీజింగ్‌ : కరోనా వైరస్‌ విజృంభణతో చైనా సతమతమవుతోంది. దీంతో విదేశీయులు చైనా వెళ్లాలంటే హడలిపోతున్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి చైనాకు వచ్చేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. మరోవైపు వచ్చే రెండు నెలల్లో చైనాలో జరగాల్సిన పలు అంతర్జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వాహకులు వాయిదా వేస్తున్నారు. మార్చి నెలలో నాన్జింగ్‌లో జరిగే వరల్డ్‌ ఇండోర్‌ చాంపియన్‌షిప్‌ను వాయిదా వేసుకుంటున్నట్టు అంతర్జాతీయ ట్రాక్‌ సమాఖ్య ప్రకటించింది. తమ వైద్య బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్ట ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

అలాగే అంతర్జాతీయ స్కీ ప్రతినిధులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఫిబ్రవరి నెలలో నిర్వహించాల్సిన డౌన్‌హిల్‌, సూపర్‌ జీ ఈవెంట్లను వాయిదా వేస్తున్నామని.. కొత్త తేదీలను ఇంకా ప్రకటించలేదని తెలిపారు. అంతర్జాతీయ స్కీ సమాఖ్య అధ్యక్షుడు జియాన్‌ ఫ్రాంకో కాస్పర్‌ మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య కూడా ఇదే రకంగా స్పందించింది. చైనా, బెల్జియం జాతీయ జట్ల మధ్య చ్యాగ్స్యూలో జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. చైనాలోని పరిస్థితులను పరిశీలిస్తున్నామని.. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.

మరోవైపు వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటికే 170 మంది చనిపోయారు. తీవ్రత ఎక్కువగా ఉన్న వుహాన్‌ నగరంలో ప్రజారవాణాను నిలిపివేశారు. వైరస్‌ను నియంత్రణలోకి తెచ్చేందుకు చైనా ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్‌తో భేటీ అయ్యారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top