
విశాఖపట్నం: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమికి ఉమేశ్ యాదవే కారణమంటూ విమర్శలు వినిపిస్తున్న తరుణంలో అతనికి మరో పేసర్ బుమ్రా మద్దతుగా నిలిచాడు. ప్రధానంగా చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి కావాల్సిన 14 పరుగుల్ని ఉమేశ్ ఇవ్వడంతో విమర్శల వర్షం కురుస్తోంది. అయితే అతనికి బుమ్రా అండగా నిలిచాడు. ఎటువంటి సందర్భంలోనైనా డెత్ ఓవర్లలో బౌలింగ్ చాలా కష్టమన్నాడు. కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఫలితం వస్తే, మరికొన్ని ఫలితం ప్రతికూలంగా ఉండవచ్చన్నాడు. తాము విజయం అంచుల వరకూ వచ్చి మ్యాచ్‌ను చేజార్చుకోవడం బాధకరమే అయినప్పటికీ, ఎవరూ కావాలని పరుగులు ఇవ్వరు కదా అంటూ ఉమేశ్‌ను వెనకేసుకొచ్చాడు. (ఇక్కడ చదవండి: టీమిండియా విలన్ ఉమేశ్ యాదవ్!)
కాగా, తాము బ్యాటింగ్‌లో ఇంకా 15-20 పరుగులు వెనుకబడిపోయామన్నాడు. కనీసం 140 నుంచి 145 పరుగులు చేసి మంచి టార్గెట్‌ను ఆసీస్‌కు నిర్దేశించే వాళ్లమన్నాడు. తాము అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నించినప్పటికీ కీలక సమయంలో వికెట్లు కోల‍్పోవడంతో స్కోరు మందగించిందన్నాడు. అదే తమ ఓటమిపై ప్రభావం చూపించిందని బుమ్రా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌తో కేఎల్ రాహుల్ తిరిగి ఫామ్‌లో రావడం సంతోషంగా ఉందన్నాడు. (ఇక్కడ చదవండి: బుమ్రా బంతి.. వాహ్!)