మూడేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి.. | Bravo Recalled To West Indies Squad For T20I series | Sakshi
Sakshi News home page

మూడేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి..

Jan 13 2020 11:58 AM | Updated on Jan 13 2020 12:00 PM

Bravo Recalled To West Indies Squad For T20I series - Sakshi

గ్రెనడా:  ఇటీవల తన రిటైర్మెంట్‌పై యూటర్న్‌ తీసుకున్న వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌కు బ్రేవోను ఎంపిక చేస్తూ విండీస్‌ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. 2016లో విండీస్‌ తరఫున చివరి మ్యాచ్‌ ఆడిన బ్రేవో.. ఆపై బోర్డుతో విభేదించి వీడ్కోలు చెప్పాడు. కాగా, కొంతకాలం క్రితం నూతన బోర్డు ఏర్పాటు కావడంతో తన వీడ్కోలు నిర్ణయాన్ని బ్రేవో ఉపసంహరించుకున్నాడు. ఈ క్రమంలోనే తన పునరాగమనంపై ఆశలు పెట్టుకున్న బ్రేవోకు ఊహించినట్లుగానే చోటు కల్పించింది విండీస్‌ మేనేజ్‌మెంట్‌. 

2016 సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ బ్రేవోకు అంతర్జాతీయ స్థాయిలో చివరిది. కాగా, మూడేళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ కోసం సిద్ధమయ్యాడు. ఇక ఐర్లాండ్‌తో సిరీస్‌కు టెస్టు కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌కు విశ్రాంతి కల్పించారు. ఇక ఫాబియన్‌ అలెన్‌ గాయం నుంచి ఇంకా కోలుకోలేకపోవడంతో అతను అందుబాటులోకి రాలేదు. దాంతోనే బ్రేవో ఎంపికకు మార్గం సుగమం అయ్యింది. ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను విండీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement