ఐపీఎల్‌: చెన్నైని వీడని నీటి కష్టాలు!

Bombay High Court Bars MCA From Using Pavana Dam Water for IPL - Sakshi

మైదానానికి నీటిని ఉపయోగించవద్దన్న బాంబే హైకోర్టు 

ముంబై : రెండేళ్ల నిషేదానంతరం ఐపీఎల్‌-11 సీజన్‌లో పునరాగమనం చేసిన చెన్నైసూపర్‌ కింగ్స్‌ జట్టుకు నీటి కష్టాలు వీడటం లేదు. కావేరీ జల వివాదం కారణంగా తమిళనాడులో నిరసనలు తీవ్ర స్థాయికి చేరడంతో చెన్నైలో నిర్వహించాల్సిన మ్యాచ్‌లను పుణెకు తరలించారు. అయితే ఇక్కడ సైతం చెన్నై జట్టుకి వీడని నీడలా నీటికష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణ కష్టంగా మారనుంది. 

తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పుణె మైదానాన్ని సిద్దం చేసేందుకు పవానా డ్యాం నీటిని ఉపయోగించవద్దని మహారాష్ట్ర క్రికెట్‌ సంఘాన్ని(ఎంసీఏ)ను బుధవారం బాంబే హైకోర్టు  ఆదేశించింది. గతంలో పుణె స్టేడియానికి పవానా నది నుంచి నీటి సరఫరా జరుగుతోందని లోక్‌సత్తా మూవ్‌మెంట్ అనే ఎన్జీవో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ‘పవానా నది నుంచి మాత్రమే పుణే నదికి నీరు అందుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరవు పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో నీటిని ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం వినియోగిస్తే.. దాని ప్రభావం నీటి సరఫరాపై పడుతుంద’ని లో‌క్‌సత్తా వాదించింది.

పుణె వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం వినియోగించే నీటిని ఎలా సమకూర్చుకుంటున్నారో తమకు వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర క్రికెట్ సంఘం(ఎంసీఏ)కు కోర్టు గత వారం కోర్టు నోటీసులు పంపించింది. నోటీసులపై ఏప్రిల్ 18లోగా సమాధానం చెప్పాలని గడువు కూడా విధించిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు హోమ్‌ మ్యాచ్‌లను ఇక్కడ నిర్వహించాల్సి ఉంది. అయితే కోర్టు తాజా నిర్ణయంతో మ్యాచ్‌లు మరొక చోటికి తరలించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ పుణే నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేదికను మారిస్తే మాత్రం అందుకు ఆతిథ్యమిచ్చే నగరాల్లో విశాఖపట్టణం ముందు వరుసలో ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top