ఐపీఎల్‌.. బెట్టింగ్‌ ఫుల్‌

Betting Arrangements Made in West Godavari - Sakshi

ఈనెల 7 నుంచి మే 27 వరకు 11వ ఐపీఎల్‌

51 రోజులు.. 60 మ్యాచ్‌లు

పందాలకు బెట్టింగ్‌రాయుళ్ల సన్నాహాలు!

జిల్లాలో రూ.వందల కోట్లలో బెట్టింగులు

సాక్షి, జంగారెడ్డిగూడెం: ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలు ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో బెట్టింగ్‌రాయుళ్లు పండగ చేసుకోనున్నారు. ఐపీఎల్‌ బెట్టింగ్‌ల కోసం జిల్లాలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈనెల 7 నుంచి మే 27 వరకు ఫైనల్‌ మ్యాచ్‌తో సహా 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్‌ 11వ ఎడిషన్‌ 51 రోజుల పాటు జరగనుంది. దీంతో బెట్టింగ్‌ రాయుళ్లు సమాయాత్తం అవుతున్నారు. జిల్లాలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు జోరుగా సాగుతాయి. నిత్యం కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. దీనికోసం బుకీలు అపార్ట్‌మెంట్‌లు, లాడ్జీలు వేదికగా చేసుకుని పెద్దెత్తున బెట్టింగ్‌లు నిర్వహిస్తారు. ఐపీఎల్‌ పేరుతో జిల్లాలో రూ.వందల కోట్లకు పైగానే చేతులు మారే అవకాశం ఉంది. క్రికెట్‌ బుకీలు ప్రధానంగా యువతను టార్గెట్‌ చేసుకుని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. 

యువత టార్గెట్‌గా..
జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, గణపవరం, ఉండి, ఏలూరు, నరసాపురం కేంద్రాలుగా చేసుకుని బెట్టింగ్‌లు జరుగుతాయి. అక్కడ బుకీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సబ్‌బుకీలు బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటారు. భీమవరం, తణుకు నుంచి నేరుగా ముంబైతో సంబంధాలు ఏర్పాటుచేసుకుని పెద్దెత్తున బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రతి బాల్‌కు, ప్రతి ఓవర్‌కు ఇంతని బెట్టింగ్‌ నిర్వహిస్తుంటారు. విలాస జీవితానికి అలవాటుపడిన యువతను టార్గెట్‌ చేసుకుని క్రికెట్‌ బుకీలు పెద్దెత్తున బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. తమను ఎవరూ ఏం చేయలేరని, ఇప్పటికే అధికారులను ‘మేనేజ్‌’ చేసుకున్నామని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. 

సాంకేతిక దన్నుతో..
గతంకన్నా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు రావడంతో బెట్టింగ్‌ రాయుళ్లకు సులభతరమైంది. గతంలో టీవీలు, సెల్‌ఫోన్‌లు, లాప్‌టాప్‌లు ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించేవారు. తాజాగా జియో నెట్‌వర్క్, హాట్‌స్టార్‌ అనే యాప్, ఐపీఎల్‌ కోసం ప్రత్యేక యాప్‌లు రావడంతో క్రికెట్‌ బెట్టింగ్‌ మరింత సులభతరమైంది. అంతేగాక ఆన్‌లైన్‌ అకౌంట్‌ల ద్వారా బెట్టింగ్‌ జరుగుతోంది. ప్రస్తుతం హాట్‌ స్టార్‌ యాప్‌ ద్వారా లైవ్‌ క్రికెట్‌ అతి తక్కువ రూపాయలతో అందిస్తుండటంతో దీనిని వినియోగించుకుని కూడా బెట్టింగ్‌లు జోరుగా సాగే అవకాశం ఉంది.

మెట్టలో జోరుగా..
జిల్లాలోని మెట్ట ప్రాంతంలో జంగారెడ్డిగూడెం, మండలంలోని పుట్లగట్లగూడెం, లక్కవరం, జంగరెడ్డిగూడెంలోని ఉప్పలమెట్ట, కామవరపుకోట, బయ్యనగూడెం, రామానుజపురం, యర్నగూడెం తదతర ప్రాంతాలు కేంద్రంగా పెద్దెత్తున క్రికెట్‌ బెట్టింగ్‌లు జరుగుతుంటాయి. జిల్లాలోని ప్రధాన కేంద్రాల నుంచి మండల, గ్రామీణ ప్రాంతాల బుకీలు సంబంధాలు ఏర్పాటు చేసుకుని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.. ఇదిలా ఉంటే కొంతమంది బెట్టింగ్‌ రాయుళ్లు పొలాల్లో, అతిథి గృహాలను కేంద్రంగా చేసుకుని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఐపీఎల్‌ పేరుతో యువత లక్షలాది రూపాయలు కోల్పోయి, ఆయా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఛిన్నాభిన్నం అవుతున్న దాఖలాలు ఉన్నాయి. గతంలో క్రికెట్‌ బెట్టింగ్‌లో లక్షలాది రూపాయలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఈ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. అయినా పట్టించుకున్న వారే లేరు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top