
ముంబై: అభిమానుల ఆదరణలో శిఖరాన ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక ఆసక్తికర మార్పు గురించి గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచిస్తోంది. లీగ్‌లో తొలిసారి ‘పవర్ ప్లేయర్’ పేరుతో అదనపు ఆటగాడిని మ్యాచ్ మధ్యలో తుది జట్టులో ఆడించవచ్చనేదే ఈ కొత్త ప్రతిపాదన. దీనిపై బోర్డు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నేడు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరగనుంది.
ఎప్పుడైనా బరిలోకి...
ఈ ప్రతిపాదన ప్రకారం... మ్యాచ్‌కు ముందు 11 మందితో కాకుండా 15 మంది సభ్యుల జట్టును ప్రకటిస్తారు. మ్యాచ్ కీలక సమయంలో తుది జట్టులో లేని ఒక ఆటగాడి అవసరం జట్టుకు ఉందని భావిస్తే డగౌట్ నుంచి అతడిని పిలిపించి నేరుగా ఆడించవచ్చు. ఇది వికెట్ పడినప్పుడు గానీ, ఓవర్ ముగిసినప్పుడు కానీ చేయవచ్చు. ఉదాహరణకు ఆండ్రీ రసెల్‌లాంటి విధ్వంసక బ్యాట్స్‌మన్ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో బయటే కూర్చున్నాడు. కానీ చివరి ఓవర్లో జట్టు విజయానికి 20 పరుగులు అవసరమైన సమయంలో క్రీజ్‌లో ఉన్నవారిపై నమ్మకం లేకపోతే రసెల్‌ను పిలిచి బ్యాటింగ్ చేయించవచ్చు.
అదే విధంగా చివరి ఓవర్లో ప్రత్యర్థి 6 పరుగులు చేయాల్సి ఉండగా... తుది జట్టులో లేకపోయినా బుమ్రాలాంటి బౌలర్ అందుబాటులో ఉంటే అతడిని మైదానంలోకి పిలిచి బౌలింగ్ చేయించవచ్చు. ఐపీఎల్‌కంటే ముందు ముస్తాక్ అలీ ట్రోఫీలో దీనిని ప్రయోగాత్మకంగా వాడాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. అయితే మాటల్లో చెప్పుకునేందుకు ఆసక్తికరంగా అనిపిస్తున్నా... మ్యాచ్‌ను గందరగోళంగా మార్చే ఈ నిబంధనపై తీవ్ర విమర్శలు రావచ్చు. పైగా ఐపీఎల్ పూర్తిగా ఐసీసీ నిబంధనలకు అనుగుణంగానే సాగే టోర్నీ. ఐసీసీలో లేని నిబంధనను ఇందులో కొత్తగా చేరిస్తే టోర్నీ విలువ అర్థరహితంగా మారిపోయే ప్రమాదమూ ఉంది!