భువీకి శస్త్రచికిత్స.. ఐపీఎల్‌ డౌటేనా?

BCCI Says Bhuvneshwar to Begin Rehabilitation at NCA - Sakshi

టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు లండన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో హెర్నియా శస్త్రచికిత్స జరిగిందని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. గత కొంతకాలంగా వరుస గాయాలతో సతమతమవుతున్న ఈ మీడియం పేసర్‌ జట్టులోకి వస్తూ వెళుతున్నాడు. తాజాగా వెస్టిండీస్‌ సిరీస్‌లో ఇబ్బంది పడిన ఈ బౌలర్‌ను జట్టు నుంచి తప్పించారు. అయితే తాజాగా భారత ఫిజియోథెరపిస్ట్‌ యోగేశ్వర్‌ పర్మార్‌ పర్యవేక్షనలో భువీకి శస్త్రచికిత్స జరిగిందని, పునరావాస శిక్షణ కోసం త్వరలోనే జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో చేరతాడని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. అయితే విశ్రాంతి ఎన్ని రోజులు అనే దానిపై అయన స్పష్టతనివ్వలేదు. దీంతో భువీ ఐపీఎల్‌ ఆడటం అనుమానమేనని పలువురు క్రికెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రధానమైన బౌలరైన భువీ ఐపీఎల్‌ ఆడకపోతే ఆ జట్టుకు తీవ్ర నష్టం జరగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

అదేవిధంగా ఏడు నెలల నిషేధం, తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన యువ క్రికెటర్ పృథ్వీ షా విషయంపై కూడా బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ప్రథ్వీ షా గాయం నుంచి కోలుకున్నాడని, పునరావాస కేం‍ద్రం ఎన్‌సీఏలో పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని జైషా పేర్కొన్నాడు. అంతేకాకుండా సెలక్షన్స్‌కు అతడు పూర్తిగా అందుబాటులో ఉంటాడని, త్వరలో న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న భారత-ఏ జట్టుతో కలుస్తాడని తెలిపాడు. ఇక ఆటగాళ్లు పదేపదే గాయాల పాలవడంతో  ఎన్‌సీఏ తీరు పట్ల  మాజీ క్రికెటర్లు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. పునరావాసా కేం‍ద్రంలో ఆటగాళ్లకు కావాల్సిన కనీస సౌకర్యాలు లేవని, అందుకే జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యాలు ఎనీసీఏపై నమ్మకం లేకనే ప్రయివేట్‌గా ట్రైనింగ్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top