భారీగా తగ్గిన బీసీసీఐ మిగులు! | BCCI heavily reduced surplus! | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గిన బీసీసీఐ మిగులు!

Nov 11 2015 12:19 AM | Updated on Sep 3 2017 12:20 PM

భారీగా తగ్గిన బీసీసీఐ మిగులు!

భారీగా తగ్గిన బీసీసీఐ మిగులు!

గతేడాదితో పోలిస్తే ఈసారి (2014-15) బీసీసీఐ మిగులు గణనీయంగా తగ్గింది.

2014-15 ఏడాదికి రూ. 167 కోట్లే
గతేడాదితో పోలిస్తే 69 శాతం తగ్గుదల
ఖర్చులు పెరగడమే కారణం

 
ముంబై: గతేడాదితో పోలిస్తే ఈసారి (2014-15) బీసీసీఐ మిగులు గణనీయంగా తగ్గింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి బోర్డు ఆదాయంలో రూ. 526 కోట్లు మిగులుగా ఉంటే ఈ సీజన్‌లో అది రూ. 167 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాది బోర్డుకు రూ. 1121 కోట్లు సమకూరినా... ఇందులో క్రికెట్ వ్యవహారాల కోసం ఏకంగా 928 కోట్లు ఖర్చు చేశారు. గతేడాది ఖర్చు రూ. 516 కోట్లు మాత్రమే. 31 మార్చి 2015 వరకు బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ ద్వారా రూ. 121 కోట్లు, ఐపీఎల్ ద్వారా రూ. 1000 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇది రూ. 194 కోట్లు, రూ. 1194 కోట్లుగా ఉంది. ఈ ఏడాది అంతర్జాతీయంగా మ్యాచ్‌ల సంఖ్య తగ్గడంతో పాటు ఐపీఎల్‌లో 8 జట్లు మాత్రమే బరిలోకి దిగడంతో ఆదాయం కాస్త తగ్గిందని బోర్డు కోశాధికారి అనిరుధ్ చౌదరి తెలిపారు. 2013-14లో ఐపీఎల్‌లో 9 జట్లు బరిలోకి దిగాయి. అయితే గత ఏడాది (రూ. 33 కోట్లు)తో పోలిస్తే ఈసారి ఐసీసీ నుంచి బీసీసీఐకి రూ. 54 కోట్లు వచ్చాయి. రాబోయే ఏళ్లలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చౌదరి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2015-16)గానూ ఆదాయం రూ. 1937 కోట్లు ఉంటుందని బోర్డు అంచనా వేస్తోంది.

మరోవైపు బోర్డు కష్టకాలంలో ఉందని బీసీసీఐ కొత్త అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అన్నారు. ప్రక్షాళనలో భాగంగా కఠిన నిర్ణయాలకు మద్దతివ్వాలని ముందుగానే సభ్యులకు విజ్ఞప్తి చేసిన మనోహర్ తాను అనుకున్నది సాధించారు. బోర్డు స్వతంత్రతను కాపాడేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తన వార్షిక నివేదికలో రాసుకొచ్చారు. ‘రెండోసారి అధ్యక్షుడిగా నా ముందు పెను సవాళ్లు ఉన్నాయి. స్పాట్ ఫిక్సింగ్ అంశంతో బోర్డు కల్లోలంలో పడింది. కాబట్టి సభ్యులందరూ కొన్ని నిర్ణయాలకు మద్దతు తెలపాల్సిందే. నిధులు ఎలా ఖర్చు చేస్తున్నామో అందరికీ తెలియాలి. అందుకే పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని మనోహర్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement