
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్ర క్రికెటర్ కె.నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనకు బీసీసీఐ గుర్తింపు లభించింది. బోర్డు ప్రకటించిన 2017–18 వార్షిక అవార్డుల్లో అండర్–16 ఉత్తమ క్రికెటర్‌గా నితీశ్ ఎంపికయ్యాడు. ఈ సీజన్‌లో పరుగుల వరద పారించిన నితీశ్ 7 మ్యాచ్‌లలో ఏకంగా 176.71 సగటుతో 1,237 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ రాణిం చిన అతను 13.84 సగటుతో 26 వికెట్లు పడగొట్టాడు. 65 ఏళ్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చరిత్రలో ఆ జట్టుకు చెందిన ఒక ఆటగాడు బీసీసీఐ అవార్డు గెలుచుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఈ నెల 12న బెంగళూరులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో నితీశ్ ఈ అవార్డు అందుకుంటాడు. అతనికి జగ్మోహన్ దాల్మియా ట్రోఫీతో పాటు రూ. 1.5 లక్షల నగదు పురస్కారం కూడా లభిస్తుంది. అవార్డు గెలుచుకున్న నితీశ్‌ను ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు, కార్యదర్శి అరుణ్ కుమార్ అభినందించారు. మరోవైపు సీనియర్, జూనియర్ విభాగాల్లో ఢిల్లీ జట్టు నిలకడగా రాణించడంతో ‘బెస్ట్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్’ అవార్డు ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ)కు దక్కనుంది.