బీబీసీ అత్యుత్తమ ఆటగాడిగా స్టోక్స్‌ | Sakshi
Sakshi News home page

బీబీసీ అత్యుత్తమ ఆటగాడిగా స్టోక్స్‌

Published Tue, Dec 17 2019 1:30 AM

BBC Most Valuable Player Ben Stokes - Sakshi

అబెర్దీన్‌ (స్కాట్లాండ్‌): ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఈ ఏడాది ప్రతిష్టాత్మక బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ) ‘స్పోర్ట్స్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. గ్రేట్‌ బ్రిటన్‌ తరఫున వివిధ రంగాల్లో అసమాన ప్రదర్శన కనబర్చిన వారికి బీబీసీ ప్రతీ ఏటా ఈ పురస్కారాలు అందిస్తుంది. 2019లో మైదానంలో స్టోక్స్‌ ప్రదర్శన ఇంగ్లండ్‌ అభిమానుల దృష్టిలో అత్యుత్తమంగా నిలిచింది. ఇంగ్లండ్‌ తొలిసారి గెలుచున్న వన్డే వరల్డ్‌ కప్‌లో స్టోక్స్‌ 66.42 సగటుతో 5 అర్ధ సెంచరీలు సహా 465 పరుగులు చేశాడు. ఫైనల్‌ పోరులో అతనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఆ తర్వాత యాషెస్‌ సిరీస్‌లో భాగంగా హెడింగ్లీలో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌కు ఓటమి ఖాయమనిపించిన దశలో 135 పరుగుల అద్భుత బ్యాటింగ్‌తో తమ జట్టును గెలిపించాడు.

ప్రేక్షకుల ఓటింగ్‌ ప్రకారం నిర్ణయించిన ఈ అవార్డులో స్టోక్స్‌ తర్వాత ఫార్ములావన్‌  డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌కు రెండో స్థానం దక్కింది. 2005లో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తర్వాత ఒక క్రికెటర్‌ అత్యుత్తమ ఆటగాడి పురస్కారాన్ని అందుకోవడం ఇదే మొదటిసారి. కొన్నాళ్ల క్రితం బ్రిస్టల్‌లో జరిగిన ఒక పబ్‌ ఉదంతంలో వ్యక్తిపై దాడికి పాల్పడి దాదాపు కెరీర్‌ ముగిసిపోయే ప్రమాదంలో నిలిచిన దశ నుంచి ఇప్పుడు స్టోక్స్‌ అందరినుంచి నీరాజనాలు అందుకోవడం విశేషం. ‘రెండేళ్ల క్రితం నా జీవితంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాను. కానీ అలాంటి స్థితిలో అండగా నిలిచిన నా సన్నిహితుల వల్ల కోలుకోగలిగాను. ఒక టీమ్‌ ఈవెంట్‌లో నా వ్యక్తిగత ప్రదర్శనను అంతా గుర్తించినందుకు సంతోషంగా ఉంది’ అని స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు. బీబీసీ అవార్డుల్లో ప్రపంచ కప్‌ గెలుచుకున్న ఇంగ్లండ్‌ వన్డే జట్టు ‘టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలవగా... సూపర్‌ ఓవర్‌ చివరి బంతికి స్టంప్స్‌ను పడగొట్టి గప్టిల్‌ను కీపర్‌ బట్లర్‌ రనౌట్‌ చేసిన క్షణం ‘గ్రేటెస్ట్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌’ అవార్డుకు ఎంపికైంది.  1954లో నెలకొల్పిన బీబీసీ స్పోర్ట్స్‌ అవార్డుల్లో ఇప్పటివరకు ఐదుగురు క్రికెటర్లు మాత్రమే ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో జిమ్‌ లేకర్‌ (1956లో), డేవిడ్‌ స్టీలీ (1975లో), ఇయాన్‌ బోథమ్‌ (1981లో), ఆండ్రూ ఫ్లింటాఫ్‌ (2005లో) ఈ అవార్డును పొందారు.

Advertisement
Advertisement