అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పాత కమిటీ (2010-12)పై విచారణను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వేగవంతం చేసింది.
సాక్షి, హైదరాబాద్ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పాత కమిటీ (2010-12)పై విచారణను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వేగవంతం చేసింది. విచారణను త్వరగా ముగించాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు నేడు పాత కమిటీ సభ్యులందరినీ విచారించనున్నారు.
ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ విచారణకు హాజరు కావాలని అధికారులు వారిని ఆదేశించారు. శుక్రవారం హెచ్‌సీఏ కార్యాలయం నుంచి ఫోన్లు చేసి విచారణకు రావాలని సూచించారు. 2010 నుంచి 2012 వరకు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అర్షద్ అయూబ్, కార్యదర్శిగా డి.ఎస్. చలపతి ఉన్నారు. ఆఫీస్ బేరర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కలిపి మొత్తం 15 మంది ఏసీబీ ముందు విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు విచారణకు సంబంధించి ఉప్పల్ స్టేడియంలో పెద్దసంఖ్యలో ఉన్న పత్రా లు, దస్త్రాలను రెండు రోజుల కిందట ఏసీబీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.