
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో మరోసారి వివాదం చెలరేగింది. హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న దల్జిత్ సింగ్‌పై పలువురు క్లబ్ సెక్రటరీలు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఫిర్యాదు చేశారు. కాగా ఈ నెల 28న ముంబై లో బీసీసిఐ 95వ వార్షిక సభ్య సమావేశం (AGM) జరుగనుంది.
ఈ నేపథ్యంలో ఏజీఎంలో పాల్గొనేందుకు బీసీసీఐ... అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా హెచ్‌సీఏకు కూడా ఆహ్వానం అందింది. ఈ క్రమంలో HCA యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా దల్జిత్ ఉండటం నిబంధనలకు విరుద్ధం అంటూ పలువురు క్లబ్ సెక్రటరీలు బీసీసీఐకి లేఖలు రాశారు. అదే విధంగా.. దల్జిత్‌పై సింగిల్ మెoబర్ కమిటీ జస్టిస్ నవీన్ రావ్‌కు కూడా వీరు ఫిర్యాదు చేశారు.
కాగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును జూలై నెలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడితో పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా సీఐడీ అరెస్టు చేసింది.
ఈ క్రమంలో జగన్మోహన్ రావు అక్రమ పద్ధతిలో హెచ్‌సీఏలోకి ప్రవేశించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడిగా జగన్మోహన్ రావును తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అతడి స్థానంలో దల్జిత్ సింగ్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.