ఆసీస్‌... అజేయంగా

Australia wrap up T20 tri-series with DLS win over New Zealand - Sakshi

ముక్కోణపు టి20 టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం

ఆక్లాండ్‌: అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా ముక్కోణపు టి20 టోర్నీలో విజేతగా నిలిచింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా ఫైనల్‌ చేరిన ఆసీస్‌... బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 19 పరుగులతో గెలుపొందింది. తద్వారా కనీసం మూడు దేశాలు పాల్గొన్న  టోర్నీలో ఆసీస్‌ మొదటిసారి చాంపియన్‌గా నిలిచింది. తొలుత న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 14.4 ఓవర్లలో 3 వికెట్లకు 121 పరుగులతో ఉన్న సమయంలో భారీ వర్షం కారణంగా ఆట సాధ్యపడలేదు. వర్షంవల్ల ఆట నిలిచే సమయానికి డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఆసీస్‌ విజయ సమీకరణం 102 పరుగులు. ఆసీస్‌ ఆ స్కోరుకంటే 19 పరుగులు ఎక్కువగానే చేయడంతో విజయం ఖాయమైంది.

అంతకుముందు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అగర్‌ (3/27) ధాటికి  కివీస్‌ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. గప్టిల్‌ (21; 2 ఫోర్లు, 1 సిక్స్‌), మున్రో (29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాస్‌ టేలర్‌ (43 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో రిచర్డ్‌సన్, ఆండ్రూ టైలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఓపెనర్లు వార్నర్‌ (25; 2 ఫోర్లు), షార్ట్‌ (30 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగడంతో ఆసీస్‌ సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో తుది ఫలితం ఆసీస్‌ ఖాతాలోకి వెళ్లింది. మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు దక్కింది. తాజా విజయంతో ఐసీసీ టి20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్, ఆసీస్‌ 126 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే దశాంశాల్లో స్వల్ప తేడాతో పాక్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top