చేజేతులా...

Australia beats India by 11 runs - Sakshi

మహిళల ముక్కోణపు టి20 టోర్నీ ఫైనల్లో భారత్‌ పరాజయం

ఒకదశలో 115/3... ఆ తర్వాత 144కు ఆలౌట్‌

ఆస్ట్రేలియాను గెలిపించిన జెస్సికా (5/12)  

మెల్‌బోర్న్‌: కీలకదశలో ఒత్తిడికి లోనైన భారత మహిళల క్రికెట్‌ జట్టు మూల్యం చెల్లించుకుంది. విజేతగా నిలవాల్సిన చోట పరాజయాన్ని పలకరించింది. ముక్కోణపు టి20 క్రికెట్‌ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 11 పరుగుల తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఒకదశలో 15 ఓవర్లలో 3 వికెట్లకు 115 పరుగులు చేసి విజయందిశగా సాగుతోంది. భారత్‌ విజయానికి 30 బంతుల్లో 41 పరుగులు అవసరమైన దశలో... ఆస్ట్రేలియా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జెస్సికా జొనాస్సెన్‌ మాయాజాలం చేసింది. జెస్సికా స్పిన్‌ వలలో చిక్కుకున్న భారత మహిళల జట్టు చివరి 7 వికెట్లను 29 పరుగుల తేడాలో కోల్పోయి సరిగ్గా 20 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది.

జోరు మీదున్న స్మృతి మంధాన (37 బంతుల్లో 66; 12 ఫోర్లు)ను మేగన్‌ షుట్‌ అవుట్‌ చేయగా... ఆ తర్వాత జెస్సికా స్పిన్‌కు హర్మన్‌ప్రీత్‌ (14; 2 ఫోర్లు)... దీప్తి శర్మ (10), అరుంధతి రెడ్డి (0), రాధా యాదవ్‌ (2), తానియా భాటియా (11; 2 ఫోర్లు) పెవిలియన్‌ చేరుకున్నారు. శిఖా పాండే (4)ను ఎలీస్‌ పెర్రీ అవుట్‌ చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. బెథానీ మూనీ (54 బంతుల్లో 71 నాటౌట్‌; 9 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. యాష్లే గార్డెనర్‌ (26; 5 ఫోర్లు), మేగన్‌ లానింగ్‌ (26; 2 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. భారత స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా ఏకంగా 19 పరుగులు సాధించి భారత్‌ ముందు క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top