అంబటి రాయుడికి ఐసీసీ ఝలక్‌!

Ambati Rayudu Suspended From Bowling in International Cricket - Sakshi

దుబాయ్‌ : టీమిండియా క్రికెటర్‌, హైదరాబాద్‌ స్టార్‌ ఆటగాడు అంబటి రాయుడికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) ఝలక్‌ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో రాయుడు బౌలింగ్‌ చేయకుండా నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో రాయుడు ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ను ఐసీసీ తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ నివేదికను ఐసీసీ భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు అందజేయడంతో పాటు.. అతను 14 రోజుల్లోగా పరీక్షకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. అయితే ఈ పరీక్షకు ఈ హైదరాబాద్‌ ఆటగాడు హాజరుకాకపోవడంతో నిబంధనల మేరకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో రాయుడు బౌలింగ్‌ చేయరాదని, దేశవాళీ, బీసీసీఐ పరిధిలో జరిగే టోర్నీల్లో మాత్రం చేయవచ్చని స్పష్టం చేసింది.

జనవరి 13లోగా రాయుడు బౌలింగ్‌ పరీక్షకు హాజరు కావాల్సింది. కానీ న్యూజిలాండ్‌ పర్యటనతో బీజీగా ఉన్న రాయుడు పరీక్షకు హాజరు కాలేదు. దీంతో ఐసీసీ క్లాజ్‌ 4.2 నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ చేయకుండా నిషేధం విధించింది. అతను పరీక్షకు హాజరై తన బౌలింగ్‌ యాక‌్షన్‌ సరైనదేనని నిరూపించుకునే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఇక పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ రాయుడు తన 46 మ్యాచ్‌ల వన్డే కెరీర్‌లో 20.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసి 3 వికెట్లు తీశాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌తో పాటు దేశవాళీ వన్డేలు, టి20ల్లో అతను ఒక్కసారి కూడా బౌలింగ్‌ చేయలేదు. సిడ్నీ వన్డేలో 2 ఓవర్లు వేసిన రాయుడు 13 పరుగులిచ్చాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top