అయ్యో స్మిత్‌.. అరంగేట్రం తర్వాత తొలిసారి

1st Time, Smith Ends A Test Series Not Hitting A Fifty - Sakshi

అడిలైడ్‌: తన అరంగేట్రం తర్వాత ఒక టెస్టు సిరీస్‌లో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ రాణించలేనిది ఏదైనా ఉందంటే పాకిస్తాన్‌తో ముగిసిన ద్వైపాక్షిక సిరీసే. ఇటీవల యాషెస్‌ సిరీస్‌లో విశేషంగా రాణించిన స్టీవ్‌ స్మిత్‌.. పాకిస్తాన్‌తో సిరీస్‌లో మాత్రం విఫలమయ్యాడు. పాకిస్తాన్‌తో బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు మాత్రమే చేసిన స్మిత్‌.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేశాడు. దాంతో ఈ సిరీస్‌లో 40 పరుగులు మాత్రమే స్మిత్‌ చేశాడు. ఫలితంగా తన టెస్టు కెరీర్‌ ఆరంభించిన తర్వాత ఒక సిరీస్‌లో కనీసం హాఫ్‌ సెంచరీ లేకుండా ముగించాల్సి వచ్చింది.

ఇప్పటివరకూ ప్రతి సిరీస్‌లోనూ స్మిత్‌ కనీసం హాఫ్‌ సెంచరీ సాధిస్తూ వస్తున్నాడు. కాకపోతే పాకిస్తాన్‌తో మాత్రం స్మిత్‌ దాన్ని చేరుకోలేకపోయాడు. దాంతో ఒక సిరీస్‌లో హాఫ్‌ సెంచరీ లేకుండా వస్తున్న స్మిత్‌కు ఫుల్‌స్టాప్‌ పడింది. స్మిత్‌ అరంగేట్రం తర్వాత 21 టెస్టు సిరీస్‌లు ఆడాడు. అయితే పాకిస్తాన్‌తో సిరీస్‌లో హాఫ్‌ సెంచరీ సాధించకపోవడంతో స్మిత్‌ ఒక రికార్డును కూడా కోల్పోయాడు. ఇంగ్లండ్‌ మాజీ ఓపెనర్‌ మార్కస్‌ ట్రెస్కోథిక్‌ 23 వరుస టెస్టు సిరీస్‌ల్లో హాఫ్‌ సెంచరీలు సాధించిన రికార్డును స్మిత్‌ మిస్సయ్యాడు.

ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.  సోమవారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో భాగంగా పాక్‌కు కూల్చేసిన ఆసీస్‌ మరో ఇన్నింగ్స్‌ విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 239 పరుగులకు కట్టడి చేసిన ఆసీస్‌.. ఇన్నింగ్స్‌ 48 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలి టెస్టులో సైతం ఆసీస్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో అసాద్‌ షఫీక్‌(57), మహ్మద్‌ రిజ్వాన్‌(45)లు, షాన్‌ మసూద్‌(68)లు మాత్రమే రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. దాంతో పాక్‌కు ఇన్నింగ్స్‌ పరాభవం తప్పలేదు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లయన్‌ ఐదు వికెట్లతో పాక్‌ పతనాన్ని శాసించాడు. అతనికి జతగా హజల్‌వుడ్‌ మూడు వికెట్లు సాధించగా, మిచెల్‌ స్టార్క్‌కు వికెట్‌ దక్కింది. 39/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఫాలోఆన్‌ను కొనసాగించిన పాకిస్తాన్‌ను ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు మసూద్‌-షఫీక్‌లు ఆదుకునే యత్నం చేశారు. కాగా, వీరిద్దరూ ఔటైన తర్వాత పాకిస్తాన్‌ పతనం కొనసాగింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top