ఆఫ్రిది లాంటి తండ్రుల్లాగే..

Mo Salah Shares Adorable Pic With Daughter Who Score Goal - Sakshi

‘ అవును.. ఇంట్లో మనిద్దరం ఒకేలా ఉంటామని నాకు తెలుసు. అయితే నాకిది ఎంతో కొత్తగా అనిపిస్తుంది’ అంటూ ఈజిప్టు ఫుట్‌బాల్‌ ఆటగాడు మహ్మద్‌ సలాహ్‌ ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్‌ చేసిన ఫొటో అభిమానుల హృదయాలు దోచుకుంటోంది. ఇప్పటికే 30 లక్షలకు పైగా లైకులు సాధించిన ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌, సలాహ్‌ల మధ్య పోలిక తెస్తూ ఆఫ్రిదిని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం లివర్‌పూల్‌, మాంచెస్టర్‌ సిటీ జట్ల మధ్య ఫుల్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. అయితే మ్యాచ్‌ అనంతరం మైదానంలోకి పరిగెత్తుకొచ్చిన సలాహ్‌ కూతురు మక్కా.. తండ్రి లాగే తాను కూడా గోల్‌ కొట్టేందుకు ప్రయత్నించి విజయవంతమైంది. దీంతో మైదానంలో కేరింతలు కొడుతున్న కూతురిని దగ్గరికి తీసుకున్న సలాహ్‌.. ఆమెను ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఈ ఆనందంలో ప్రీమియర్‌ లీగ్‌ గోల్డెన్‌ బూట్‌ అవార్డు అందుకున్న అనంతరం కూతురితో కలిసి ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

కాగా సామాజిక కట్టుబాట్లను దృష్టిలో ఉంచుకుని తన కూతుళ్లు అన్షా, అజ్వా, అస్మారా, అక్షకు ఇండోర్‌ గేమ్స్‌ మాత్రమే ఆడడానికి అనుమతిస్తానని క్రికెటర్‌ ఆఫ్రిది పేర్కొన్న సంగతి తెలిసిందే. ఎంత ఎదిగినా ఇస్లాం నియమాలను గౌరవిస్తానని తన కూతుళ్లను ఔట్‌డోర్‌ గేమ్స్‌ ఆడనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో సలాహ్‌, ఆఫ్రిదిల మధ్య పోలిక తెచ్చిన ఓ నెటిజన్‌.. ‘ కూతుళ్లను, వారి ప్రతిభను కంట్రోల్‌ చేయాలనుకునే ఆఫ్రిది లాంటి తండ్రుల్లాగే.. తన చిన్నారి కూతురిని స్వేచ్ఛగా ఆడుకోనిస్తూ.. వారి ఆనందం చూసి ఉప్పొంగిపోయే సలాహ్‌ వంటి తండ్రులు కూడా ఉంటారు అంటూ ఆఫ్రిదిని ట్రోల్‌ చేసింది. ఆమె ట్వీట్‌కు మద్దతు తెలిపిన నెటిజన్లు.. ఆఫ్రిదికి, సలాహ్‌కు ఉన్న తేడా ఇది’ అంటూ ఆఫ్రిదిని విమర్శిస్తున్నారు.

చదవండి : నా కూతుళ్లకు ఆ పర్మిషన్‌ లేదు : మాజీ క్రికెటర్‌

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top