నా కూతుళ్లకు ఆ పర్మిషన్‌ లేదు : మాజీ క్రికెటర్‌

My Daughters Have No Permission To Play Outdoor Sports Says Shahid Afridi - Sakshi

ఇస్లాం నియమాలను గౌరవిస్తా 

అందుకే నా పిల్లలు క్రికెట్‌కు దూరం

ఆత్మకథలో తేల్చిచెప్పిన షాహిద్‌ ఆఫ్రిది

ఇస్లామాబాద్‌ : మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది మరోసారి వార్తల్లో నిలిచారు. పాక్‌ క్రికెట్‌కి విశేష సేవలందించిన దిగ్గజ ఆటగాడు కూతుళ్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటానంటున్నాడు. వారికి క్రికెట్‌ లాంటి ఔట్‌డోర్‌ గేమ్స్‌ ఆడడానికి పర్మిషన్‌ లేదని అన్నారు. ఎంత ఎదిగినా ఇస్లాం నియమాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. సామాజిక కట్టుబాట్లను దృష్టిలో ఉంచుకుని తన కూతుళ్లు అన్షా, అజ్వా, అస్మారా, అక్షకు ఇండోర్‌ గేమ్స్‌ మాత్రమే ఆడడానికి అనుమతిస్తానని చెప్పారు. ఇటీవల విడుదలైన ఆఫ్రిది ఆత్మకథ ‘గేమ్‌ చేంజర్‌’లో ఈ విషయాలు వెల్లడైనట్టు ఓ ఆంగ్ల మీడియా తెలిపింది. ఇక తన నిర్ణయంపట్ల స్త్రీవాదులు ఏం మాట్లాడుకున్నా తనకు అనవసరమని ఆఫ్రిది అందులో చెప్పినట్టు తెలిసింది.
(చదవండి : ఆఫ్రిది.. నిన్ను సైక్రియాట్రిస్ట్‌ వద్దకు తీసుకెళ్తా.. రా!)

‘చిన్న పిల్లలు అజ్వా, అస్మారాకు డ్రెస్‌ అప్‌ ఆట అంటే ఇష్టం. ఎటువంటి ఇండోర్‌ గేమ్స్‌ అయినా ఆడుకోవడానికి వాళ్లకు నా అనుమతి ఎప్పుడూ ఉంటుంది. కానీ క్రికెట్‌ ఆడేందుకు, బహిరంగ ప్రదేశాల్లో పోటీపడే ఆటలకు నా పిల్లలు దూరం’ అని పుస్తకంలో చెప్పుకొచ్చారు. ఇక ఈ పుస్తకంలో.. కశ్మీర్‌ వివాదంపైన, పాకిస్తాన్‌ ఆటగాళ్లపైన, పాక్‌ క్రికెట్‌ మాజీ కోచ్‌ జావేద్‌ మియాందాద్‌పైనా విమర్శలు చేశారు. 2010లో పాకిస్తాన్‌ క్రికెట్‌లో వెలుగుచూసిన స్పాట్‌ఫిక్సింగ్‌ వ్యవహారంపై జాగ్రత్తగా ఉండాలని జూనియర్లకు సూచించారు. భారత మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్‌పైనా విమర్శలకు దిగారు. డాన్‌ బ్రాడ్‌మన్‌, జేమ్స్‌ బాండ్‌కు మధ్యరకంలా గంభీర్‌ ప్రవర్తిస్తూ ఉంటాడని, ఆటలో అతనికి పెద్ద రికార్డులు లేకపోయినా.. అటిట్యూడ్‌ మాత్రం చాలా ఎక్కువ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘ఆఫ్రిదీ నువ్వు చాలా సరదా మనిషివి. మెడికల్‌ టూరిజంలో భాగంగా మేం ఇప్పటికీ పాకిస్థానీలకు వీసాలు ఇస్తున్నాం. నేనే స్వయంగా నిన్ను సైక్రియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్తాలే..’ అంటూ బదులిచ్చారు. పాత్రికేయుడు వజాహత్‌ ఖాన్‌తో కలిసి అఫ్రిది ‘గేమ్‌ చేంజర్‌’  పుస్తకాన్ని రాశాడు.

(చదవండి : స్పాట్‌ ఫిక్సింగ్‌ సమాచారం ముందే తెలుసు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top