‘వైద్య సిబ్బంది లాక్‌డౌన్‌ చేస్తే.. మీ పరిస్థితి ఏంటి?’

Coronavirus: KTR Shares A Video On Twitter Goes Viral - Sakshi

మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమతమ పనులు చూసుకుంటున్నారు. ప్రభుత్వం ఎందుకు లాక్‌డౌన్ ప్రకటించిందో అర్థం చేసుకోకుండా గుంపులు గుంపులుగా తిరిగేస్తున్నారు. ఇది తమ మంచికే అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో, రాష్ట్రంలో కరోనా ఎంత ప్రమాదకరంగా మారిందో, భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుపుతూ ఓ డాక్టర్‌ వీడియోను రూపొందించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే ఈ వీడియోను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ డాక్టర్‌ చెప్పింది శ్రద్దగా వినండి అని పేర్కొన్నారు. 

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
‘లాక్‌డౌన్‌ ప్రకటించకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. మిమ్మల్ని అందరిని ఇంట్లో పెట్టి పారిశుద్య కార్మికులు, పోలీసులు, మా వైద్య బృందం మేమందరం మీకోసం ఈ ఆస్పత్రుల్లో పని చేస్తున్నాం. ఏ మాకు లేవా కుటుంబాలు? ఇంతవరకు జీతాలు కూడా రాలేదు. అయినా సరే మేమందరం నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాం. కేవలం మీకోసం. ఇంత చేస్తున్నా మీరు పట్టించుకోకుండా మీకు నచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్నారు. తిరిగితే ఏమవుతుంది. మహా అయితే కరోనా అంటించుకుంటావు. 

నీకు కరోనా వచ్చిన విషయం 14 రోజుల వరకు తెలియదు. ఆ లోపు 1400 మందికి అంటిస్తావు. ఆ 1400 మంది ఇంకో 1400 మందికి అంటిస్తారు. నువ్వు, నీ కుటుంబం, నీ ఫ్రెండ్స్‌ అందరూ పోతారు. నువ్‌ బతికినవంటే పర్లేదు.. ఒకవేళ చస్తే నీ ఇంటికి నష్టమే కదా! నీ వళ్ల నీ కుటుంబం.. నీ కుటుంబం వళ్ల నీ పక్కింటివాళ్లు, నీ ఫ్రెండ్స్‌, వాళ్ల కుటుంబాలు ఇంత మంది నీ వెనక రావాలా? ఏ నువ్వు ఒక్కడివి ఇంట్లో కూర్చోలేవా? కొన్ని రోజులు నువ్‌ బయటకి రాకపోతే దేశానికి ఏమైనా నష్టమా? 

మా ప్రాణాల మీద మాకు ఇష్టం, ప్రేమ, ఆశ ఉంటుంది కదా! మా కోసం మా కుటుంబాలు ఇంటి దగ్గర వేచి చూస్తుంటాయి కదా! మేము కూడా లాక్‌డౌన్‌ చేసుకొని ఇంట్లో ఉండిపోతే మీ పరిస్థితి ఏంటి? ఏడుంటవ్‌?. మా ప్రాణాలు తెగించి మీ కోసం ఇంత రిస్క్‌ తీసుకుంటే మీరేమో బయట పెత్తనాలు చేస్తుంటారా? ఏ కొన్ని రోజులు ఇంటి నుంచి బయటకు రాకపోతే ఏమైనా కొంపలు మునిగిపోతాయా?. బాధ్యత లేదా? చదువుకోలేదా? అర్థం కాదా? దయచేసి ప్రజలందరికి అభ్యర్థిస్తున్నా? కొన్ని రోజులు మీరు మీ ఇళ్లల్లోనే ఉండండి. ప్రభుత్వానికి సహకరిస్తూ వారు చెప్పే సూచనలను పాటించండి. కరోనాను తరిమికొట్టండి’అంటూ ఆ డాక్టర్‌ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

చదవండి:
కరోనా: నిబంధనల అతిక్రమణ.. నడిరోడ్డుపై..
కరోనాకు వ్యాక్సిన్‌ : చైనాలో క్లినికల్‌ ట్రయల్స్‌

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top