
సాక్షి, రంగారెడ్డి: అంగన్‌వాడీ ల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి నిరు ద్యోగుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. బీటెక్, పీజీ, బీఈడీ చేసిన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసించినా చదువులకు తగిన ఉద్యోగాలు లభించని కారణంగా అంగన్‌వాడీ పోస్టులపై ఆసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోంది. వేతనం తక్కువైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం కావడంతో మహిళలు అధిక సంఖ్యలో పోటీపడుతున్నారు. అంతేగాక స్థానికంగా ఉద్యోగం లభిస్తుండడం కలిసి వచ్చే అంశంగా వారు భావిస్తున్నారు. వాస్తవంగా టీచర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస అర్హత పదో తరగతి ఉత్తీర్ణతగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పదో తరగతి నుంచి మొదలుకుని పీజీ చేసిన వారంతా దరఖాస్తు చేస్తున్నారు.
దరఖాస్తుల వెల్లువ...
జిల్లాలో ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 1,600 అంగన్‌వాడీల్లో మొత్తం 287 ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీకి జిల్లా యంత్రాంగం గత నెల 24న నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల్లో ప్రధాన అంగన్‌వాడీ టీచర్లు 62, మినీ అంగన్‌వాడీ టీచర్లు 54, ఆయా పోస్టులు 171 ఉన్నాయి. అదే తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. దరఖాస్తులు సమర్పించేందుకు ఈనెల 6వ తేదీ తుది గడువు.
అయితే ఇప్పటివరకు దరఖాస్తుల సంఖ్య ఐదు వేలు దాటినట్లు అంచనా. దరఖాస్తుల సమర్పణకు మరో రోజు మిగిలి ఉండడంతో వీటి సంఖ్య ఏడు వేలు దాటొచ్చని యంత్రాంగం భావిస్తోంది. గడువు సమీపిస్తున్న సమయంలో అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తుండడంతో వెబ్‌సైట్ మొరాయిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక.. అంగన్‌వాడీ కేంద్రాల వారీగా వచ్చిన దరఖాస్తుల జాబితాను స్థానికంగా ప్రదర్శించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.