ఆస్తి కోసమే హత్య
● న్యాయవాది స్వప్న హత్య కేసు వివరాలు వెల్లడించిన డీసీపీ యోగేష్‌గౌతమ్
● నలుగురు నిందితుల అరెస్టు, రిమాండ్‌కు తరలింపు
మొయినాబాద్‌రూరల్: ఆస్తి వివాదమే న్యాయవాది స్వప్న హత్యకు దారితీసిందని డీసీపీ యోగేష్‌గౌతమ్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం మొయినాబాద్ ఠాణాలో వివరాలు వెల్లడించారు. కేతిరెడ్డిపల్లిలోని నాలుగు ఎకరాల పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదంలో స్వప్న సొంత అన్నయ్య జి.రాజు, మరో ముగ్గురు ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో స్వప్న తల్లితో కలిసి కేతిరెడ్డిపల్లిలోని సర్వే నంబర్ 339లోని భూమి వద్దకు వెళ్లారు. సర్వే పూర్తయిన తర్వాత వెంకటాపూర్ నుంచి నక్కలపల్లికి వెళ్లే రోడ్డు వైపు తిరిగి వస్తుండగా రాజు మరో ముగ్గురితో కలిసివచ్చి కారుతో ఢీకొట్టారు. స్వప్న గుంతలో పడిపోగా పెద్ద కర్రలు, రాళ్లతో దాడి చేసి, కత్తితో గొంతు కోశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను హత్య చేయాలని రెండుమూడు సంవత్సరాల నుంచే పథకం పన్నుతున్నారు. ఈ మేరకు గురువారం రాజుతోపాటు నిందుతులైన ఎర్రోళ్ల సందీప్, వడ్డె వీరేష్, కావలి శివనుంచి కారు, స్కూటీ, నాలుగు మొబైల్‌ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


