కేసీఆర్ గుర్తులు ఎవరూ చెరపలేరు
మొయినాబాద్: మాజీ సీఎం కేసీఆర్ గుర్తులు లేకుండా చేయడం సీఎం రేవంత్‌రెడ్డి తరం కాదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్, ఎనికేపల్లిలో గురువారం బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో భారీ ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పేరుతో ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఉచిత బస్సు అంటున్నారు.. కానీ బస్టాపుల్లో బస్సులు ఆపడంలేదు. రైతు భరోసా అన్నారు.. ఇప్పటికీ ఎవరికీ వేస్తలేరని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని.. బిల్లులు ఇవ్వడంలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రజలకు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. అభివృద్ధి జరగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న, సమన్వయ కమిటీ సభ్యుడు వెంకట్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు కొత్త మాణిక్‌రెడ్డి, లావణ్య పాల్గొన్నారు.
సత్తా చాటాలి
చేవెళ్ల: వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని, తప్పకుండా మెజార్టీ స్థానాలు గెలుస్తామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని 8, 11 వార్డుల్లో గురువారం రాత్రి ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
మున్సిపల్ ప్రచారంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి


