
వైఎస్సార్ సీపీ పోలింగ్ బూత్ కన్వీనర్లను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, తిరుపతి : ప్రజా భక్షక పాలనపై యుద్ధానికి సిద్ధం కావాలని బూత్ కమిటీ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని కోరారు. ప్రజలకు, పార్టీకి బూత్ కమిటీ సభ్యులు వారధిలాంటి వారని పేర్కొన్నారు. తిరుపతి పీఎల్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం నాలుగు రోజుల జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కో–ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, తమ్మినేని సీతారాం, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రెడ్డమ్మ, చిత్తూరు, కుప్పం, తంబళ్లపల్లి, పలమనేరు నియోజకవర్గాల సమన్వయకర్తలు జంగాలపల్లి శ్రీనివాసులు, చంద్రమౌళి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాకేష్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా జ్వోతి వెలిగించి, మహానేత వైఎస్‌కు నివాళులర్పించారు. అనంతరం చిత్తూరు, కుప్పం, తంబళ్లపల్లి, పలమనేరు బూత్ కమిటీ సభ్యులకు రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. బూత్ కమిటీ కన్వీనర్ల విధులు, బాధ్యతల గురించి వైఎస్సార్‌సీపీ నేతలు వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలు, పార్టీ సిద్ధాంతాలు, భావజాలాలు, పార్టీ ఆవిర్భావం, ఆవశ్యకత గురించి, పార్టీ లక్ష్యాలు, స్థానిక ప్రభుత్వాలు, పూర్వాపరాలు, వ్యక్తిత్వ వికాసం, పార్టీ ప్రజా పోరాటాల గురించి ఎంపీ విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, భూమన కరుణాకరరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తమ్మినేని సీతారాం వివరించారు.
ఎన్నికల నిర్వహణలో బూత్ కమిటీలే కీలకం..
గ్రామస్థాయిలో పార్టీ పటిష్టతకు, ఎన్నికల నిర్వహణలో బూత్ కమిటీలే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని వైఎస్సార్‌సీపీ నేతలు వివరించారు. దొంగ ఓట్ల గుర్తింపుపై బూత్ కమిటీలు ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ఓటింగ్ సమయంలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమైందని గుర్తు చేశారు. పార్టీకి, ప్రజలకు బూత్ కమిటీ కన్వీనర్లు వారధుల్లా వ్యవహరించాలని సూచించారు. ప్రజా భక్షక పాలనకు ఎదురొడ్డి నిలబడాలని బూత్ కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. పార్టీ చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చిన్నపాటి లోపాలకు తావులేకుండా పనిచేయాలని కోరారు. ఈసారి జిల్లాలో అన్ని స్థానాలను కైవశం చేసుకునేందుకు కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కుప్పం సమన్వయకర్త చంద్రమౌళి మాట్లాడుతూ పలు నీతికథలను బోధిస్తూ బూత్ కమిటీ సభ్యులను ఉత్తేజపరిచారు.
విశ్వసనీయత వైఎస్ జగన్ నైజం అని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓటుతో కూల్చేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో బూత్ లెవల్ కన్వీనర్లు కీలకంగా వ్యవహరించాలని తంబళ్లపల్లి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సూచించారు. ప్రజలు జగన్‌కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే వారిని బూత్ వరకు తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. పలమనేరు నేత ఆకుల గజేంద్ర మాట్లాడుతూ చంద్రబాబు నీతి నిజాయితీలేని రాజకీయాలు చేయడంలో నేర్పరని దుయ్యబట్టారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చల్లా మధుసూదన్‌రెడ్డి, వెంకటే గౌడ్ పాల్గొన్నారు.