హోదాపై టీడీపీ, బీజేపీ డ్రామాలు | Sakshi
Sakshi News home page

హోదాపై టీడీపీ, బీజేపీ డ్రామాలు

Published Fri, Jul 20 2018 6:53 AM

YSRCP MLC Vennapusa Gopal Reddy slams On TDP - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఆంధ్రప్రదేశ్‌కు సంజీవిని అయిన ప్రత్యేక హోదాపై తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. కర్నూలులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హోదా ఇస్తానని నరేంద్రమోదీ, హోదా తెస్తానని చంద్రబాబు..2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మరిచారన్నారు. నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్ష మేరకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం 13 సార్లు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినా స్పీకర్‌ స్పందించలేదన్నారు. అంతేకాకుండా తమ పదవులకు రాజీనామాలు చేసి నిరాహార దీక్ష చేసినా.. కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల్లో టీడీపీ ఎంపీలు ఇచ్చిన మొదటి అవిశ్వాస తీర్మానానికే స్పీకర్‌ స్పందించి చర్చకు అనుమతించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ టీడీపీ, బీజేపీ కుమ్మక్కు రాజకీయమని, దీనిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు.
 
ఏపీ పురోగతి 15 ఏళ్లు వెనక్కి.. 
ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి ఒప్పుకొని సీఎం చంద్రబాబునాయుడు తప్పు చేశారని, ఈ వ్యవహారంతో ఏపీ పురోగతి 15 ఏళ్లు వెనక్కి పోయిందని ఎమ్మెల్యే గోపాల్‌ రెడ్డి అన్నారు. నరేంద్రమోదీ పాలనలో బ్యాంకులు  దీవాలా తీశాయని, ఏటీఎంలు మూతపడడంతో రెండు లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తాననే హామీని తుంగలోకి తొక్కి.. తన కుమారుడు లోకేశ్‌కు మాత్రం మంత్రి పదవి ఇచ్చుకున్న చరిత్ర చంద్రబాబుకే చెల్లిందన్నారు.  రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు 72 వేల మందిని తొలగించడం దారుణమన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను భూములను తీసుకొని.. 20 వేల మంది చిన్న, సన్నకారు రైతులను బిక్షగాళ్లను చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది ఒడ్డున లింగమననేని ఎస్టేట్స్‌లో సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్నారన్నారు. నాలుగేళ్లుగా శాశ్వత ప్రతిపాదికన ఒక్క ఇటుకను రాజధాని నిర్మాణానికి వేయలేకపోయారని విమర్శించారు.  
బీజేపీతో ఎవరికి సంబంధం ఉందో తెలిసిపోయింది... 
ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం, బీజేపీలు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్తకార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ.. వైఎస్సార్‌సీపీకి బీజేపీతో సంబంధం ఉందంటూ ఊదరగొడుతోందన్నారు. గతంలో పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు 13 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా స్పందించని బీజేపీ... టీడీపీ ఎంపీల ఒక్కసారి ఇచ్చిన నోటీసులకే స్పందించడంతో ఎవరు ఎవరితో ఉన్నారో రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయిందన్నారు. బీజేపీ, టీడీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నాయని చెప్పడానికి అవిశ్వాస తీర్మానంపై స్పందనే నిదర్శనమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ప్రతి బ్యాంకు నుంచి 20 యూనిట్లకు లోన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ మద్దయ్య కోరారు.

ప్రస్తుతం ఒక బ్యాంకు నుంచి నాలుగు యూనిట్లను మాత్రమే ఇస్తుండడంతో అర్హులైన పేదలు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 46 ఎస్సీ, 24 బీసీ హాస్టళ్లను మూసి వేసి వాటి స్థానంలో రెసిడెన్షియల్‌ పాఠశాలలను ప్రారంభిస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. హాస్టళ్లు మూతపడడంతో పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్త చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీసీ నాయకులు చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, నాయకులు రాజేష్, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

అన్ని రంగాల్లో వైఫల్యం 
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఎమ్మెల్సీ గోపాల్‌ రెడ్డి విమర్శించారు.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్క, పాముకాటుకు మందులు లేకపోవడం దారుణమన్నారు.  ఇటీవల అనంతపురం జిల్లాలో పాముకాటుకు ఏడుగురు మృతిచెందినా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. నిరుద్యోగ భృతిని ఒక్కొక్కరికీ రూ.2 వేల ప్రకారం ఆరవై సంవత్సరాలు వచ్చే వరకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్న క్యాంటిన్లను ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు నలుగురితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన గవర్నర్‌ నరసింహన్‌పై కోర్టులో రిట్‌ వేసినట్లు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement