చంద్రబాబు ఏపీని వదిలి వెళ్లాల్సిందే: రోజా

YSRCP MLA RK Roja Slams Chandrababu, Nara lokesh  - Sakshi

సాక్షి, చోడవరం : వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మహిళలకు రక్షణ, గౌరవం ఉంటాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రోజా అన్నారు. గురువారం చోడవరంలో జరిగిన వైఎస్సార్‌ సీపీ మహిళ గర్జనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆడవాళ్ల మానప్రాణాలతో చెలగాటమాడిన ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పసుపు​-కుంకుమ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు.

వీధికో బార్‌, గ్రామల్లో విచ్చలవిడిగా వైన్‌ షాపులకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని దుయ్యబట్టారు. మహిళా అధికారిపై ఎమ్మెల్యే దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని, మహిళలను కించపరిచే టీడీపీ పాలనలో చంద్రబాబును అన్న అని కాకుండా సున్నా అని పిలవాలని రోజా సూచించారు. మహిళలకు మాంగల‍్యం దూరం చేసే మద్యం అమ్మకాలు నిలిపివేసే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాత్రమే అన్నా అని పిలవగలమన్నారు. ప్రజాసంకల్పయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకొని వైఎస్‌ జగన్ నవరత్నాలను రూపొందించారని అన్నారు. 

అమరావతిలో శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకున్న నాయకుడు వైఎస్‌ జగన్‌ అని, ఇంతకాలం ఎన్టీఆర్‌ భవన్‌ కూడా అమరావతిలో ఏర్పాటు చేయని చంద్రబాబు ...ఎన్నికల తర్వాత ఏపీని వదిలి వెళ్లాల్సిందేనని అన్నారు. జగన్ అమరావతిలో అడుగుపెట్టిన వెంటనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చిందన్న ఆమె... చంద్రబాబును రాష్ట్రం నుంచి వెళ్లగొడితే ఏపీకి హోదా వస్తుందన్నారు.  ఇక చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌ ఎందుకు పనికిరాని గన్నేరు పప్పు అని ఎద్దేవా చేశారు. తండ్రి గుడిని మింగితే కొడుకు గుడిలో లింగాన్ని కూడా మింగేస్తారని వ్యాఖ్యానించారు. 

చీరలు ఇస్తే ఓటు వేస్తారనే భ్రమలో ఉన్న చంద్రబాబుని మహిళలు చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. మహిళలకు కుటీర పరిశ్రమలు ఇవ్వకపోగా తన కోడలు బ్రహ్మణీకి మాత్రం హెరిటేజ్‌ కంపెనీ ఇచ్చారని ఆమె విమర్శించారు. పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌లు ఇవ్వాలన్న ఆలోచన అవుట్‌ డేటెడ్‌ చంద్రబాబుది అని, డ్వాక్రా మహిళలకు ఇచ్చేందుకు ఆయన వద్ద డబ్బులు కూడా లేవా అని ప్రశ్నలు సంధించారు. ఈ చెక్కులు ద్వారా మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారని, ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే ఈ చెక్కులు చెల్లవని చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. వైఎస్సార్ సీపీ మహిళ గర్జనలో అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, పీలా వెంకటలక్ష్మి, వరలక్ష్మి, కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top