
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల కుప్పగా మార్చారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. సోమవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పలు చెరిగారు. అప్పుల కోసం అంకెలను మార్చారంటూ సురేష్ విమర్శించారు. భారీగా అవినీతికి పాల్పడటానికే కమీషన్లు, లంచాలు వచ్చే శాఖలకే అధిక నిధుల కేటాయింపులు జరిపారని దుయ్యబట్టారు.
అధికారంలోకి రావడానికి వందలకొద్ది హామీలు ఇచ్చిన చంద్రబాబు, వాటి అమలుకు మాత్రం బడ్జెట్‌లో చిల్లర కూడా విదల్చలేదని సురేష్ మండిపడ్డారు. ప్రభుత్వం కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును విస్మరిస్తోందని, గత నాలుగేళ్లలో కేవలం రూ.7వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. నాలుగేళ్లలో చేసిందేమీ లేకపోయినా గొప్పలు చెప్పుకుంటున్నారంటూ మండిపడ్డారు. తలసరి ఆదాయంపైనా ప్రజలను మభ్యపెట్టే విధంగా ముఖ్యమంత్రి మాయమాటలు చెప్తున్నారంటూ విమర్శించారు.