చంద్రబాబును ఇంకా నమ్మాలా?  | YS Jaganmohan Reddy fires on chandrababu at nallamada | Sakshi
Sakshi News home page

చంద్రబాబును ఇంకా నమ్మాలా? 

Dec 21 2017 1:25 AM | Updated on Jul 25 2018 4:58 PM

YS Jaganmohan Reddy fires on chandrababu at nallamada - Sakshi

అనంతపురం జిల్లా నల్లమాడలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశాక మీ అందరినీ అడుగుతున్నాను. ఈ నాలుగేళ్లలో సంతోషంగా ఉన్నామని ఎవరైనా గుండెలపై చేతులు వేసుకొని చెప్పగలరా? మీ మనస్సాక్షిని అడగండి. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయని చంద్రబాబే చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్క దాన్నైనా నెరవేర్చని ఈ నాయకుడ్ని మనం ఇంకా నమ్మాలా?’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం 40వ రోజు అనంతపురం జిల్లా నల్లమాడలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెబుతూ పబ్బం గడుపుకునే పిట్టల దొర మాదిరిగా చంద్రబాబు తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఈ పిట్టల దొర శివన్న అనే రైతును ఎంత బాగా మోసం చేశాడో చెబుతాను వినండంటూ ఓ పిట్టకథ చెప్పారు. జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే.. 

అనగనగా ఓ పిట్టల దొర.. 
‘‘అనంతపురం జిల్లా అమడగూరు మండలం గుండువారి పల్లెలో శివన్న అనే రైతు ఉన్నాడు. ఆయనకు ఐదు ఎకరాల భూమి ఉంది. అప్పుచేసి తెచ్చిన రూ.90 వేలను ఖర్చుచేసి ఆ ఐదెకరాల భూమిలో వేరుశనగ వేశాడు. వర్షాలు లేక కరవు వచ్చింది. అందులోనూ అది అనంతపురం జిల్లా.. పైగా అధికారంలోకి వచ్చింది చంద్రబాబు కనుక వర్షాలు పడలేదు. అప్పుడు ఓ పిట్టల దొర వచ్చాడు. ఆ పిట్టల దొర ఏమన్నాడో తెలుసా.. దేవుణ్ణి నమ్ముకోకుండా నన్ను నమ్ముకో అన్నాడు. అప్పుడు శివన్నకేమీ అర్థం కాలే.. అయినా పిట్టలదొర చెబుతా ఉన్నాడు.. అంత పెద్ద మనిషయిన పిట్టలదొర చెబుతా ఉన్నప్పుడు విందాంలే అనుకున్నాడు. అప్పుడా పిట్టల దొర ‘నా దగ్గర ఓ గన్నుంది, దాన్ని రెయిన్‌ గన్‌ అంటారు. దీంతో వర్షాలు తెప్పిస్తా’ అన్నాడు. 9 ఏళ్ల అనుభవం కూడా ఉందంటున్నాడు గనుక మీ ఇష్టం అన్నాడు శివన్న. ఆ పిట్టలదొర పొలంలోకి వస్తున్నాడు గనుక అధికారులు అందరూ వచ్చి గంటలో శివన్న పొలంలో గుంత తొవ్వారు.

టార్పాలిన్‌ తెచ్చి అందులో పరిచారు. ఒక ట్యాంకర్‌ నీళ్లు తెచ్చి అందులో పోశారు. అప్పుడా పిట్టల దొర రెయిన్‌గన్‌ తెచ్చి పెట్టాడు. ఫొటోగ్రాఫర్లు టపటపామని ఫొటోలు తీయడానికి రావడంతో ఆ పిట్టల దొర పోజులిచ్చాడు. ఆ తర్వాత రెయిన్‌గన్‌ను ఆన్‌ చేశారు. అప్పటికే ఆ గుంతలో నీళ్లు ఉండడంతో ఆ గన్ను అటూ ఇటూ అలా ఇలా నీళ్లు చిమ్మింది. ఆ ట్యాంకర్‌ నీళ్లు అయిపోయే వరకు ఆ తతంగం నడిచింది. ఆ ప్రక్రియ అంతా జరగడానికి ఓ అరగంట పట్టింది. శివన్న సంతోషపడ్డాడు. ఆ తర్వాత పిట్టల దొర వెళ్లిపోయాడు. ఆ తర్వాత శివన్న కూడా భోజనం చేసి వద్దామని ఇంటికి వెళ్లాడు. అంతే ఆ తర్వాత అధికారులు టార్పాలిన్‌ చుట్ట చుట్టేశారు. గన్‌ ఎత్తుకుపోయారు. కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత శివన్న పరిస్థితి ఏమిటో తెలుసా.. ఇదిగో ఈ ఫొటోలు చూడండి.. (ఇది రెయిన్‌గన్‌. పిట్టలదొర రావడానికి గంట ముందు శివన్న పొలంలో తవ్విన ఫారం పాండ్, అధికారులు వచ్చి పక్కన నిలబడ్డ దృశ్యం.

పిట్టలదొర రెయిన్‌గన్‌ ఆన్‌ చేయడం) గన్నూ లేదు, అధికారులూ లేరు. మామూలుగా అయితే ఎకరాకు 20 బస్తాలైనా వేరుశనక్కాయల దిగుబడి వస్తుంది. ఆ లెక్కన ఐదు ఎకరాలకు వంద బస్తాలో లేకపోతే కనీసం 80 బస్తాలన్నా రావాలి. కానీ శివన్నకు వచ్చింది ఎంతో తెలుసా? కేవలం అర బస్తా. అరబస్తా కూడా కాదట కేవలం 20 కేజీలు. ఇదీ శివన్న పరిస్థితి. శివన్నకు ఏమి చేయాలో అర్థం కాలేదు. చేసిన అప్పు రూ.90 వేలు తీర్చేందుకు ఊరూరా తిరుగుతూ వడియాలు, బొరుగులు (మరమరాలు) అమ్ముకుంటున్నాడు. ఇంతకీ ఆ పిట్టల దొర ఎవరో తెలుసా? (జనం నుంచి చంద్రబాబు.. చంద్రబాబు.. అంటూ అరుపులు, కేకలు). కరెక్టుగా చెప్పారు.. ఆ పిట్టల దొర చంద్రబాబే. ఇడిగో ఆ రైతే ఈ శివన్న.. ఆయన ఏమంటాడో వినండి (శివన్నను పిలిచి మైకు చేతికి ఇచ్చారు). ‘చంద్రబాబు మాట వినొద్దు. ఆయన మోసం చేశాడు. అయినా నాకు మాట తిరగదు. జగన్‌మోహన్‌రెడ్డి చాలు మనకు. చంద్రబాబు సావాసమే వద్దు మనకు’ అన్నాడు. 

మోసం చేయడం ధర్మమేనా? 
చంద్రబాబు సావాసమే మనకు వద్దని శివన్న చెబుతున్నాడు. శివన్న తెలుగుదేశానికే ఓటు వేశారు. అయినా రుణమాఫీ కాలేదు.  అప్పులు తెచ్చి వ్యవసాయం చేసి నష్టపోయాడు. ఇప్పుడు ఆ బాకీ తీర్చడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆయన భార్య కూడా బెంగళూరులో ఓ హోటల్‌లో పని చేస్తోందని చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా బాధేసింది. శివన్న లాంటి రైతులు ఎందరో ఉన్నారు. ఎంత దారుణం. మోసం చేయడం ధర్మమేనా బాబూ అని అడుగుతున్నా. వీళ్లను క్షమిస్తే మున్ముందు ఇంకా ఏమంటారో తెలుసా? ప్రతి ఇంటికీ కేజీ బంగారం, కారు ఇస్తామంటారు.ఇటువంటి నేతలను బంగాళాఖాతంలో కలపాలి. అది చేయాలంటే జగన్‌ ఒక్కడి వల్లే కాదు. మీరందరూ సహకరిస్తేనే  సాధ్యం అవుతుంది. మీ అందరి దీవెనలు, ఆశీస్సులు ఉన్నప్పుడే ఇటువంటి వ్యక్తులను పక్కన బెట్టగలుగుతాం. రాజకీయాలలో విశ్వసనీయతను తీసుకువస్తాం. చెప్పింది చేయకపోతే తమ ప దవికి రాజీనామా చేసి ఇంటికి పోయే పరిస్థితి రావాలి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఒక దళిత మహిళపై రాక్షసంగా ప్రవర్తిస్తూ అందరూ చూస్తుండగా దాడి చేసి చీర, జాకెట్‌ను చింపేయడం దారుణం. 14 మంది దళితులకు కొన్నేళ్ల కిందట ప్రభుత్వం ఎకరం స్థలం ఇచ్చింది. ఈ స్థలాన్ని టీడీపీ నాయకులు లాక్కునే ప్రయత్నం చేస్తే న్యాయం కోసం దళితులు కోర్టుకెళ్లారు. వారికి అనుకూలంగా తీర్పు వచ్చినా అధికారం ఉందనే అహంకారంతో స్థలాన్ని ఖాళీ చేయించేందుకు రౌడీ మూకల్లా తెలుగుదేశం నాయకులు వెళ్లి అడ్డొచ్చిన ఒక దళిత మహిళ పట్ల నీచంగా ప్రవర్తించడం పట్ల చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి.

ఇలాంటి ఘటన జరిగితే ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. ఆ దళిత మహిళపై దాష్టీకానికి పాల్పడిన వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేయించి, వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడేలా చూడాలి. కానీ ఈ ముఖ్యమంత్రిలో స్పందన రాకపోతే ఇదొక పాలనా? అని అడుగుతున్నా. కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి తనకేమాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం కంటే దుర్మార్గమైన చర్య ఇంకేమైనా ఉంటుందా? రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతోంది. కర్నూలు జిల్లాలోని ఒక కోటలో గుడి ఉందట. ఆ గుడిలో బంగారం ఉందట. అడిగేవారు లేరని చంద్రబాబు ఏకంగా అక్కడ తవ్వకాలకు పురమాయించాడు. కలెక్టర్, ఇతర అధికారులు అనధికారికంగా రాత్రికి రాత్రి తవ్వకాలు జరుపుతున్నారు. టీడీపీ నేతలు అక్కడి సంపదను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి మొదలు.. మద్యం వరకు దేనినీ వదలడం లేదు. రాజధాని అమరావతి భూములు, ఆలయాల భూములు కూడా సరిపోలేదని తుదకు గుళ్లలోని ఆస్తులనూ దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు.  

చంద్రబాబును ఇంకా నమ్మాలా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement