జననేత తలపు.. ప్రజల గుండెల్లో కొలువు

YS Jagan thinking always about welfare of the people - Sakshi

అనుక్షణం ప్రజా సంక్షేమం గురించే ఆలోచన

సమస్యలు విని చలించిపోయే వైనం

చిత్తశుద్ధి ఆయన బలం.. దయాగుణం ఆభరణం

శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచనలు.. హామీలు

సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా వస్తుందనుకుని కొడుకుని ఇంజనీరింగ్‌లో చేర్పిస్తే.. ప్రభుత్వం రూ.30 వేలు మాత్రమే ఇచ్చింది. మిగిలిన రూ. 70 వేలు అప్పులు చేసి ఫీజు చెల్లించాడు ఆ పిల్లాడి తండ్రి. రెండో ఏడాది మరో రూ.70 వేలు అప్పుచేస్తే.. తిరిగి చెల్లించే స్తోమత తన తండ్రికి లేదనే బెంగతో ఆత్మహత్య చేసుకుని ఆ పిల్లాడు చనిపోయాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్థి తండ్రి నెల్లూరులో పాదయాత్ర జరుగుతున్నప్పుడు జగన్‌కు చెప్పారు. ఈ విషయాన్ని జగన్‌ విని మరిచిపోలేదు. నాలుగు రోజుల కిందట కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో గుర్తుచేయడంతో పాటు పాదయాత్రలో పలుమార్లు ప్రస్తావించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా పేద విద్యార్థుల ప్రాణాలు తీసుకుంటున్న ప్రభుత్వ తీరును ఎండగట్టడంతో పాటు ప్రజలు పడుతున్న వేదనకు జగన్‌ చలించిపోతున్నారు. ఎంత భారమైనా సరే.. పేద విద్యార్థులను నేను చదివిస్తానని హామీ ఇస్తూ బాధ్యతను భుజానికెత్తుకుంటున్నారు.  మనసున్న ఓ నాయకుడు ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలు ప్రత్యక్షంగా చూస్తే ఎలా స్పందిస్తారో అనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా నిత్యం ప్రజలతో మమేకమవుతూ...వారి కష్టాలపై స్పందిస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్ర అంటే కేవలం నడక కాదని, ప్రజల గుండెల్లోకి చేరుకునే రీతిలో స్పందించే నేతగా గుర్తింపు పొందడానికి ఇదే సాధనమని ఆయన త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నారు.  

చిత్తశుద్ధి ఉంటేనే సాధ్యం  
రాజకీయాల్లో ఎంతో చిత్తశుద్ధి ఉంటే తప్ప నేరుగా ప్రజల గుండె చప్పుడు వినడం నాయకుడికి సాధ్యం కాదు. ప్రజలతో మమేకం కావడం అందరికీ సాధ్యం కాదు.  జననేత వైఎస్‌ జగన్‌కు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ప్రజా సంకల్ప యాత్ర మరింత బలోపేతం చేస్తోంది.  జగన్‌ను రోజూ వేలాదిమంది ప్రత్యక్షంగా కలిసి తమ బాధలు, కష్టాలను ఏకరవుపెడుతున్నారు. ఆయన వ్యవహారశైలి,  సమస్యలపట్ల ఆయన స్పందించే తీరును ప్రజలు నేరుగా గమనించగలుగుతున్నారు. కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించడానికి ఉన్న మెరుగైన, సమర్థమైన అవకాశాల అన్వేషణ కోసం చేస్తున్న ప్రయత్నాలు, పడుతున్న శ్రమను ప్రజలు గుర్తిస్తున్నారు. పాలనాపగ్గాలు చేతికి వచ్చిన తర్వాత అనుసరించాల్సిన విధానాల రూపకల్పనే కాకుండా...  ఎంతోమందికి నేరుగా సహాయం అందే మార్గాన్ని చూపించడాన్ని ప్రజలు గమనించారు.  

ప్రజాభిమానానికి దాసోహం
విసుగు, విరామం లేకుండా మండుటెండలో సుదీర్ఘంగా నడవటం, వెల్లువలా వస్తున్న ప్రజల తాకిడిని తట్టుకుంటూ చెరగని చిరునవ్వుతో ముందుకు సాగడం ఎలా సాధ్యమని జననేతను ఎందరో అడుగుతుంటారు. అందరికీ ఆయన ఇచ్చే సమాధానం ఒక్కటే. ‘ప్రజలు చూపిస్తున్న అభిమానమే వారి సంక్షేమం కోసం పనిచేయడానికి ప్రేరణ ఇస్తోంది. చనిపోయిన తర్వాత కూడా వారి గుండెల్లో బతకాలన్న తపనే ముందడుగు వేయిస్తోంది’ అని జగన్‌ తన మనసులో మాట చెబుతారు. ‘ప్రజలు చూపిస్తున్న ప్రేమానురాగాలు ఒక ఎత్తు అయితే.. వారి సమస్యలు పరిష్కరిస్తానని తన మీద పెట్టుకున్న నమ్మకం బాధ్యతను మరింత పెంచుతోంది’ అని బాధ్యతను అనుక్షణం గుర్తుచేసుకుంటారు. ‘అందుకే పేదల కోసం నాన్నగారు ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తాను’ అని ప్రకటిస్తున్నారు. 

రైతు సంక్షేమమే ప్రాణం
చంద్రబాబు ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేసింది. అన్యాయం చేసింది. వారి కష్టాలకు అడ్డుకట్ట వేయాలి. రైతు దర్జాగా బతికే పరిస్థితి కల్పించడం మన ముందు ఉన్న తక్షణ కర్తవ్యం’ అని జననేత తన భవిష్యత్‌ ప్రణాళికను చెబుతారు. ‘నాయకుడు అనుక్షణం ప్రజల గురించే ఆలోచించడం చాలా అరుదు. జగన్‌ అనుక్షణం ప్రజలు, వారి బాగోగుల గురించే ఆలోచిస్తారు. అందరూ బాగుండాలని తపనపడతారు. దానికోసం ఎంతకైనా తెగించే గుణం ఆయన సొంతం. ఎంత కష్టాన్నయినా భరించే శక్తి ఆయన ప్రతి చర్యలోనూ ప్రత్యక్షంగా కనిపిస్తుంది’ అని పాదయాత్రను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top